మహిళా, పునర్విభజన బిల్లులపై కాంగ్రెస్ సందిగ్ధత

మహిళా, పునర్విభజన బిల్లులపై కాంగ్రెస్ సందిగ్ధత
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం సమావేశం కానుంది. కేంద్రం అగమేఘాల మీద తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సందిగ్దత దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు గత వారం ముగిసినా, నిరవధికంగా వాయిదా పడలేదు. 

ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఉభయసభలు మళ్లీ సమావేశం కానున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లును, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొచ్చే ఈ బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్దుష్టమైన వైఖరి ఆవలింభలేక పోతున్నది. 

ఇంత తొందర ఎందుకని కాంగ్రెస్‌ తొలి నుంచీ ప్రశ్నిస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు వ్యవహారం అత్యంత సున్నితమైన అంశమని, సమగ్ర సమీక్ష అనంతరం రాజ్యాంగ సవరణతో తీసుకోవాల్సిన ఈ నిర్ణయాలను ఆకస్మికంగా తీసుకుంటే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా, తమిళనాడు, కేరళం తదితర రాష్ట్రాలకు నష్టం చేకూరే ప్రమాదం ఉందని కేంద్రాన్ని హెచ్చరించింది.

అయితే, ఆయా రాష్ట్రాలకు నష్టం ఏర్పడబోదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ఈ బిల్లులు పార్లమెంట్ ముందుకు రావడంతో కాంగ్రెస్ ఇరకాట పరిస్థితులు ఎదుర్కొంటుంది.  పుదుచ్చేరితోపాటు నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల అనంతరం మే నెలలో వీటిపై చర్చిద్దామని ప్రతిపాదించింది కూడా. 

కేంద్రం ఇప్పటికిప్పుడే ముందుకే వెళ్లాలని నిర్ణయించుకోవడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి (ఎన్‌డీఏకు) లబ్ధి కలిగించటానికే వీటిని తెరపైకి తెచ్చారని, ఇది కోడ్‌ ఉల్లంఘన అని విమర్శించింది. కాగా, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై లోక్‌సభ సెక్రటేరియట్‌ మెమోరాండం జారీ చేసింది.

మరోవంక, పశ్చిమాసియా పరిణామాల మీద కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియా సంక్షోభానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్‌ ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించింది. కాల్పుల విరమణ, సంధి కోసం జరిగిన ప్రయత్నాల్లో ప్రధాని మోదీ ఎందుకు చొరవ చూపలేదని నిలదీసింది.