అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్ ముడి చమురు, సహజ వాయువుల్లో సింహభాగాన్ని గత కొన్నేళ్లుగా చైనాయే కొంటోంది. అందుకే ఇరాన్‌తో తాము జరుపుతున్న చర్చలకు సహకారాన్ని అందించాలని చైనాను పాక్ కోరింది. దీనికి ఈ నెల ఆరంభంలోనే చైనా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని తెరిచేలా ఇరాన్‌ను ఒప్పించడానికి తెర వెనుక చైనా చాలానే ప్రయత్నాలు చేసిందని సమాచారం.
వీటి ఫలితంగా ట్రంప్ విధించిన డెడ్‌లైన్ (ఏప్రిల్ 7న రాత్రి 8 గంటల)కు కొన్ని గంటల ముందే, అమెరికా -ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీనికి ‘ఇస్లామాబాద్ అకార్డ్స్’ అనే పేరును పెట్టారు. ఏప్రిల్ 7న ఉదయం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ దేశాలతో 26 సార్లు ఫోన్ కాల్‌లో సంభాషించినట్లు చైనా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. పశ్చిమాసియాలోని చైనా ప్రత్యేక రాయబారి కూడా ఈ చర్చల్లో కీలక పాత్రను పోషించారని చెప్పారు.
నిశితంగా పరిశీలిస్తే, చైనా ఏది చేసినా దాని ప్రయోజనాల కోసమే చేస్తుంది. చైనా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇరాన్ యుద్ధం టైంలోనూ షాడో ఫ్లీట్‌ల (బీమా లేని పాత నౌకల) ద్వారా లక్షలాది బ్యారెళ్ల ఇరాన్ చమురును కొనుగోలు చేసింది. తద్వారా చమురు సంక్షోభం నుంచి గట్టెక్కింది.
ఒకవేళ అమెరికా- ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగితే, చైనాకు ఇరాన్ చమురు ఎగుమతుల సప్లై పూర్తిగా ఆగిపోయేది. ఒకవేళ హర్మూజ్ జలసంధిని అమెరికా ఆధీనంలోకి తీసుకొని ఉంటే, చైనా షాడో ఫ్లీట్‌లను అడ్డుకొని ఉండేది. నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసినప్పటి నుంచి వెనెజువెలా చమురును పొందే అవకాశాన్ని చైనా కోల్పోయింది.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపు దాలిస్తే చైనా ఇంధన భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వస్తువులను విక్రయించే చైనా సామర్థ్యం తగ్గిపోతుంది. ఇరాన్‌తో సంప్రదింపుల మార్గాలను పాకిస్థాన్ సజీవంగా ఉంచగలిగినప్పటికీ, ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన భద్రతా ఆందోళనలతో చైనా జోక్యం చేసుకున్నందు వల్లే ఒప్పందం కుదిరింది.

More Stories
కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ థోరియం ఇంధనం దిశగా ఓ ముందడుగు!
ఖర్గే రెచ్చగొట్టే ప్రసంగంపై ఆర్ఎస్ఎస్, బీజేపీ పోలీస్ ఫిర్యాదు
రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఖర్గేను అరెస్ట్ చేయండి!