జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్‌ అనుభవం’ ‘ధురందర్‌ 2’

జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్‌ అనుభవం’ ‘ధురందర్‌ 2’
 
తదర్శకుడు ఆదిత్య ధర్‌, కథానాయకుడు రణవీర్‌ సింగ్‌లను ప్రశంసిస్తూ  బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ధురందర్‌ 2’  తన జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్‌ అనుభవం’ అని  భారత్‌ క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లీ కొనియాడారు.  ఈ సినిమాను చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ  భారత్‌ లో ఇలాంటి సినిమా అనుభవాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని స్పష్టం చేశారు. 
 
దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగిందని, ఒక్క నిమిషం కూడా కళ్లు తిప్పుకోలేకపోయానని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ‘ధురందర్‌ 2’ పోస్టర్‌ను పోస్ట్‌ చేసిన విరాట్‌.. ” ఈ రోజే సినిమా చూశాను. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా అనుభవం భారత్ లో ఇంతకుముందెన్నడూ చూడలేదని కచ్చితంగా చెప్పగలను” అని చెప్పారు. 
 
“దాదాపు 4 గంటలపాటు కనురెప్ప వేయకుండా చూశాను. నాలో ప్రతి భావోద్వేగాన్ని ఈ సినిమా తట్టిలేపింది. డైరెక్టర్‌ ఆదిత్యా ధర్‌ మీ ప్రతిభ, పట్టుదల మీరు సృష్టించిన ఈ అద్భుతంలో కనిపిస్తున్నాయి. మీకు నా హ్యాట్సాఫ్‌. మీరు ఒక జీనియస్‌” అంటూ కోహ్లీ అభినందనలు కురిపించారు.  “ఇక నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయినప్పటికీ రణవీర్‌ ఈ సినిమా తర్వాత మీరు ఒక కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. మీ నటన అద్భుతానికి మించి ఉంది. అబ్సల్యూట్లీ వావ్‌! ” అని రాసుకొచ్చారు.
కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ దీని కథనం ఆకట్టుకునేలా ఉందని, దాని నిర్మాణంలో ఉన్న నిశితమైన పనితనాన్ని ఇది ఎత్తిచూపుతోందని పేర్కొన్నారు. ఆదిత్య ధర్‌ను ట్యాగ్ చేస్తూ, అనుష్క ఇలా రాసింది: “మీరు ఎంత అద్భుతమైన సినిమా తీశారు! దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమా తీయడానికి ఎంతో దృఢ సంకల్పం కావాలి. ఆసక్తికరంగా, లీనమయ్యేలా, ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దిన ఈ సినిమా మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మీరు ఎంతో మౌలికమైన, ఆత్మవిశ్వాసం గల చిత్రనిర్మాత.”
మరోవైపు. బాక్సాఫీస్‌ వద్ద కూడా ‘ధురంధర్‌ 2’ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రయాణం ఆరంభం నుంచే ప్రభంజనం సృష్టించింది.   చిత్ర పరిశ్రమ గణాంకాలను ట్రాక్ చేసే ‘ససీనీల్క్’  ప్రకారం,ఈ చిత్రం తన 20వ రోజున రూ. 10.10 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం తన కన్నడ, తెలుగు వెర్షన్లలో అత్యధికంగా 19% ఆక్యుపెన్సీని నమోదు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో తమిళంలో 16%, హిందీలో 14%, మలయాళంలో 13% ఆక్యుపెన్సీని సాధించింది.
దీనితో, భారతదేశంలో ఈ చిత్రం సాధించిన మొత్తం వసూళ్లు రూ. 1,033.37 కోట్లకు చేరుకున్నాయి. ఆదిత్య ధర్ రూపొందించిన ఈ గూఢచారి థ్రిల్లర్ చిత్రం భారతదేశంలో రూ. 1,000 కోట్ల మైలురాయిని అధిగమించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా నిలవడం విశేషం. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, గౌరవ్ గేరా, రాకేష్ బేడి, సంజయ్ దత్, డానిష్ పండోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.