అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం

అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం

* ఎగ్జిట్‌ పోల్స్‌పై ఎన్నికల కమిషన్‌ నిషేధం

అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గత నెల రోజులుగా ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నించాయి. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ చూస్తుండగా, కేరళలో వరుసగా రెండోసారి పీఠం దక్కించుకోవాలని ఎల్డీఎఫ్ గట్టి పట్టుదలతో ఉంది. 
 
పుదుచ్చేరిలో కూడా కూటమిల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  ప్రచారం ముగియడంతో ఈ రాష్ట్రాలలో మైకులు మూగబోయాయి.  ప్రచారానికి చివరి రోజున కావడంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అసోంలో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచార హోరు వాడివేడిగా జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగింది.
 ప్రచారం ఆఖరి రోజున ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.  అస్సాంలో మొత్తం 126 స్థానాల్లో బరిలోకి దిగిన 722 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. గతంలో పలు విడతలుగా జరిగిన ఎన్నికలకు భిన్నంగా, ఈసారి అసోంలో కేవలం ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. 

కేరళంలో ఇండియా కూటమి, ఎల్డిఎఫ్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నాయి. అభివృద్ధి, అవినీతి అంశాలే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సందించుకున్నాయి. ఈ ఎన్నికల్లో కేరళలోని 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగింది. పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా ఎన్డీఏ- ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది.

ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం ఇప్పుడు పోలింగ్ నిర్వహణపై దృష్టి సారించింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మూడు ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలను కల్పించారు. ప్రచారం ముగిసిన తర్వాత ‘నిశ్శబ్ద కాలం’ అమలులో ఉన్నందున, అభ్యర్థులు బయట ప్రచారం చేయడానికి వీలుండదు.

ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. కేరళలో సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ పినరయి విజయన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందా? లేదా అస్సాంలో బీజేపీ పట్టు నిలుపుకుంటుందా? అనే అంశాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రజల నాడిని ప్రతిబింబించనున్నాయి. అప్పటి వరకు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండనుంది.

కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌పై ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించింది. ఏప్రిల్‌ 9వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి ఏప్రిల్‌ 29వ తేదీ సాయంత్రం 6.30గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే నిర్వహించడం, వాటి ఫలితాలను వెల్లడించకూడదని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఈ నిర్దిష్ట సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం లేదా వెల్లడించడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 126ఎను ఉల్లంఘించడమేనని హెచ్చరించింది. ఉల్లంఘించిన వారికి రెండేళ్ల కఠిన కారాగారశిక్ష లేదా జరిమానా , లేదా రెండూ అమలు చేయవచ్చని స్పష్టం చేసింది.