జనాభా లెక్కల్లో తెలిసిన భాషగా `సంస్కృతం’ చేర్చండి

జనాభా లెక్కల్లో తెలిసిన భాషగా `సంస్కృతం’ చేర్చండి

జనాభా లెక్కల అధికారులు సమాచార సేకరణ కోసం త్వరలో మీ వద్దకు వచ్చినప్పుడు  మిమ్మల్ని మీ మాతృభాష గురించి, ఆ తర్వాత మీకు తెలిసిన భాషల గురించి అడిగినప్పుడు, దయచేసి మీకు తెలిసిన భాషలలో “సంస్కృతం”ను చేర్చాలని సంస్కృత భారతి, తెలంగాణ విజ్ఞప్తి చేసింది.  భారత జనాభా లెక్కలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమై 2027 మార్చి నాటికి పూర్తవుతాయని తెలిసిందే. 

ప్రతి ఒక్కరూ సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడలేకపోయినప్పటికీ, మనం దానిని మన దైనందిన ప్రార్థనలు, మంత్రాలు, శ్లోకాలు, పూజలు, ఆచారాలలో తప్పకుండా ఉపయోగిస్తామని ఈ సందర్భంగా సంస్కృత భారతి గుర్తు చేసింది. అంతేకాకుండా, చాలా మంది భారతీయుల పేర్లు కూడా సంస్కృతం నుండే వచ్చినవే అని తెలిపింది.  “మీరు రోజూ పూజ చేస్తున్నారా? అయితే మీరు అది సంస్కృతం లోనే చేస్తున్నారు. కావున మీకు సంస్కృతం వచ్చు” అని నమోదు చేసుకోవచ్చని సూచించింది.

గత జనాభా లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా సంస్కృతం మాట్లాడేవారి సంఖ్య కేవలం 24,821 మాత్రమే అని నమోదు చేశారు.  కోటి మందికి పైగా ప్రజలు కేవలం సంస్కృత భారతి నుండే సంస్కృతం మాట్లాడటం నేర్చుకున్నారని గుర్తు చేసింది.  అయినా వారు జనాభా లెక్కల సమయంలో ఆ భాష వచ్చని నమోదు చేసుకోక పోవడంతో ఇంత  తక్కువ సంఖ్య ప్రభుత్వ రికార్డుల్లో నమోదు అయిందని తెలిపింది. సంస్కృతం తో పోల్చుకుంటే అరబిక్, పర్షియన్ మాట్లాడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు.

ఎందుకంటే వారు జనాభా లెక్కల సమయంలో ఆ భాష వచ్చని నమోదు చేసుకున్నారని పేర్కొంటూ దానితో వారు ప్రభుత్వ గ్రాంట్లు, మద్దతు కూడా పొందుతున్నారని సంస్కృత భారతి తెలిపింది. సంస్కృతం మాట్లాడే వారందరూ, సంస్కృతం తెలిసిన వారందరూ రాబోయే జనాభా లెక్కలలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ దీనిని ఓ బాధ్యతగా గుర్తించాలని కోరింది.

ఒకవేళ సంస్కృతాన్ని ‘అంతరించిపోతున్న భాష’గా ప్రకటిస్తే, మన ప్రాచీన గ్రంథాలైన వేదాలు, పురాణాలు మొదలైన వాటి ప్రచురణ ఆగిపోతుందని సంస్కృత భారతి ఆందోళన వ్యక్తం చేసింది. మనం మన మూలాల నుండి విడిపోతాము, చివరికి మన పూజా విధానాలు కేవలం డీజే సంగీతం వినడానికి మాత్రమే పరిమితమవుతాయని హెచ్చరించింది.

సంస్కృతం భారతదేశపు అత్యంత పురాతనమైన, అందమైన భాష అని, ఇది అన్ని భాషలకు మాతృభాషా అని పేర్కొంటూ ఈ భాషను సజీవంగా ఉంచడం మనందరి బాధ్యత అని సంస్కృత భారతి స్పష్టం చేసింది. ఒకవేళ సంస్కృతాన్ని ‘అంతరించిపోయిన భాష’గా ప్రకటిస్తే, దాని అభివృద్ధికి, విస్తరణకు ప్రభుత్వ నిధులు గానీ, మద్దతు గానీ ఉండదని, మనం దానిని శాశ్వతంగా కోల్పోవచ్చని తెలిపింది. మన సచేతన ప్రయత్నాల ద్వారా మాత్రమే సంస్కృతాన్ని సజీవంగా ఉంచగలమని స్పష్టం చేసింది.