అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం, ఘర్షణ

అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం, ఘర్షణ
 
* నలుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ
 

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలోనే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 2న మంత్రి అమిత్ షా బెంగాల్‌లోని భవానిపూర్‌లో పర్యటించారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. 

అయితే, ఈ రోడ్‌ షోలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. బీజేపీ శ్రేణులు పాల్గొన్న ఈ రోడ్‌ షోలో టీఎంసీకి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య దాడి జరిగింది. సాధారణంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనే కార్యక్రమాలకు కఠిన భద్రత ఉంటుంది. ఇలాంటి దాడులకు అవకాశం ఉండదు. కానీ, భవానిపూర్‌లో మాత్రం హింసాత్మక వాతావరణం ఏర్పడింది. 

దీంతో ఈ అంశంపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శిని ఈసీ కోరింది. ఈ నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంది. అమిత్ షా పర్యటనలో అనేక భద్రతా వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది. దీనికి బాధ్యుల్ని చేస్తూ సిద్ధార్థ్ దత్తా అనే డీసీపీ సహా మరో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

శాంతి భద్రతల్ని కాపాడటంలో వీరు విఫలమయ్యారని ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భవానిపూర్ నియోజకవర్గం చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడి నుంచి సీఎం మమతా బెనర్జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి కావడం ఖాయం. అయితే, మమతను ఓడించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఈ నియోజకవర్గంలో ఎన్నికల తతంగా ఆసక్తికరంగా మారింది.