రెండు ఎఫ్-35 విమానాల కూల్చివేత..  ఇరాన్ కు చిక్కిన ఓ పైలట్  

రెండు ఎఫ్-35 విమానాల కూల్చివేత..  ఇరాన్ కు చిక్కిన ఓ పైలట్  

24 గంటల వ్యవధిలో అమెరికాకు చెందిన రెండు ఎఫ్-35 యుద్ధ విమానాలను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఓ యుద్ధ విమానం నుంచి దూకేసిన అమెరికా పైలట్ ఇరాన్ సైన్యాలకు చిక్కినట్లు అధికారిక మీడియా సంచలన కథనం వెలువరించింది.  తమ గగనతలంలోకి వచ్చిన ఎఫ్-35 యుద్ధ విమానంపై సైనిక దళాలు దాడి చేసిన సమయంలో అందులోని నుంచి ఓ పైలట్ దూకేసి ఇరాన్ దళాలకు దొరికిపోయాడని తెలిపింది.  

ఇరాన్ గగనతలంలో ఒక విమానం కూల్చివేసిన  తర్వాత, అమెరికా సైన్యానికి చెందిన ఒక పైలట్‌ను తమ బలగాలు రక్షించాయని అధికారులు శుక్రవారం తెలిపారు.  కాగా, మరొక పైలట్‌ను రక్షించేందుకు గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మధ్యప్రాచ్యంలో సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి, ఇరాన్ భూభాగంపై అమెరికా సైన్యం ఒక విమానాన్ని కోల్పోవడం ఇదే మొదటిసారి.

‘‘శత్రువు పైలట్‌ను ఎవరైనా సజీవంగా పట్టుకుని పోలీసులు, సైనిక దళాలకు అప్పగించిన వారికి ఇరాన్ భారీ రివార్డు అందజేస్తుంది’’ అని ఇరాన్ మీడియాలో యాంకర్ చదివి వినిపించింది. అయితే, ఈ వార్తలపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది. ‘‘సాధారణ పౌరులు గుంపులుగా ప్రైవేట్ కార్లలో ప్రమాద స్థలం వైపు వెళ్లారు’’ అని ఇరాన్ మీడియాలో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 

‘‘నైరుతి ఇరాన్‌లో చాలా మంది ప్రజలు అమెరికన్ పైలట్‌ను పట్టుకోవడానికి ప్రైవేట్ కార్లలో అమెరికన్ యుద్ధ విమానం కూలిన ప్రాంతానికి వెళ్లారు. పైలట్‌ను ఎవరూ హింసించకుండా చూడాలని ఇరాన్ సాయుధ దళాలు ప్రజలకు పిలుపునిచ్చాయి’’ అని తెలిపింది.  తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో వైమానిక దళానికి చెందిన అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో అడ్డుకున్నట్టు ఇరాన్ పేర్కొంది. 

ఈ నేపథ్యంలో పైలట్ కూడా ఇరాన్‌ సైన్యాలకు చిక్కినట్టు కథనాలు వెలువడటం కలకలం రేపుతోంది.  ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎఫ్-35ను కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించడం ఇది మూడోసారి. మార్చి 23, ఏప్రిల్ 2న కూడా ఇలాంటి ప్రకటనలే చేసింది. వీటిని యూఎస్ సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. 

ఖేష్మ్ ద్వీపం సమీపంలో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన ఇరాన్ వీడియోపై స్పందిస్తూ  ‘‘అన్ని అమెరికా యుద్ధ విమానాల లెక్క తేలింది. ఇరాన్ ఐఆర్‌జీసీ ఇదే తప్పుడు వాదనను కనీసం అరడజను సార్లు చేసింది’’ అని ఖండించింది. కాగా, ఈ ప్రకటనలపై అమెరిక సెంట్రల్ కమాండ్, పెంటగాన్ లేదా వైట్‌హౌస్ నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

తమ సైన్యం ఒక అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసిన తర్వాత, మధ్య ఇరాన్‌లో అమెరికా గాలింపు, సహాయక చర్యలు చేపట్టిన మరోఅమెరికా హెలికాప్టర్‌పై కూడా ఒక క్షిపణి దాడి జరిగిందని ఇరాన్‌కు చెందిన మెహర్ వార్తా సంస్థ నివేదిస్తోంది. కూల్చివేసిన విమానం ఏ రకానికి చెందినదనే దానిపై పరస్పర విరుద్ధమైన నివేదికలు ఉన్నాయి. అది ఎఫ్-35 అయి ఉండవచ్చని ఇరాన్ నివేదికలు చెబుతుండగా, అది ఎఫ్-15 అని అమెరికాలోని నివేదికలు సూచిస్తున్నాయి.