* నేటి నుంచే ఇ20 పెట్రోల్ విక్రయాలు
పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది. దీంతో ఇరాన్ చమురును కొనుగోలు చేయడానికి భారతీయ రిఫైనరీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఒక ఆయిల్ ట్యాంకర్ ఇటీవల భారత్‌కు బయలుదేరింది. మార్చి 4న ఖార్గ్ ద్వీపంలోని ట్యాంకర్లో చమురును నింపారు.
ఇది ఏప్రిల్ 4న గుజరాత్‌లోని వడినార్ పోర్టుకు చేరుకుంటుందని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ వెల్లడించింది. 2019 తర్వాత ఇరాన్ ముడి చమురు భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి ఇందులో సుమారు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉండవచ్చని అంచనా. అయితే ఇరాన్ నుండి వస్తున్న ఈ చమురును ఏ భారతీయ రిఫైనరీ ఉపయోగిస్తుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.
గతంలో భారతదేశం ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉండేది ఒకానొక సమయంలో మొత్తం చమురు దిగుమతులలో ఇరాన్ వాటా సుమారు 11.5 శాతంగా ఉండేది. 2018లో భారత్ రోజుకు సుమారు 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకోగా, మే 2019 నాటికి అది రోజుకు 2,68,000 బ్యారెళ్లకు తగ్గింది. ఆ తర్వాత ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి.
మరోవంక,ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఇ20 ఇంధనం) విక్రయాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ వెల్లడించింది.
సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం ద్వారా ఈ ఇ20 ఇంధనాన్ని తయారు చేస్తారు. దీనివల్ల ఇంధన నాణ్యత తగ్గకుండా ఉండేందుకు, కనీసం 95 ‘రీసెర్చ్ ఆక్టేన్ నంబర్’ ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సిఫార్సు చేసిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల తలెత్తిన ఇంధన కొరతను అధిగమించడానికి ఈ స్వదేశీ ఇంధనం ఎంతో దోహదపడనుంది.
ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి ఇది గొప్ప అడుగు అయినప్పటికీ, వాహన సామర్థ్యం, ఇతర పారిశ్రామిక అవసరాలను సమన్వయం చేసుకోవడం ప్రభుత్వానికి సవాలుగా మారనుంది.

More Stories
పాక్ ను వెంటనే 3.5 బిలియన్ డాలర్ల అప్పు తీర్చమన్న యూఏఈ
ఆఫ్రికాలో చిన్న దేశం అంగోలా నుంచి భారత్ కు చమురు
విదేశీ ఔషధాలపై ట్రంప్ 100 శాతం దిగుమతి సుంకాలు