బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ మిలాఖత్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోందముని బిజెపి శాసనసభాపక్ష ఉపనాయకుడు పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన లక్షల కోట్ల అవినీతి బయటపెడతామని, విదేశాలకు దాచిన సొమ్మంతా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి, తద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడది మర్చిపోయిందని ధ్వజమెత్తారు.
లక్ష కోట్ల మేరకు అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము మొత్తం ప్రాజెక్టు మీద సీబీఐ ఎంక్వైరీ కోరామని, కానీ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా రూ. 10 వేల కోట్ల విలువైన బ్యారేజీల పనులపైనే సీబీఐ ఎంక్వైరీకి పంపి, కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయి విచారణ చేయకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని పేర్కొంటూ బీజేపీ తరఫున తామును అనేక సమస్యలను శాసనసభలో ప్రస్తావించడానికి ప్రయత్నించినప్పటికీ, తమ గొంతునొక్కే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు వస్తే సరైన సమాధానం ఇవ్వకుండా మంత్రులు ఎగతాళి చేయడం, ఎదురుదాడి చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
“జాతీయ గీతం, వందేమాతరంను అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేశాం. కానీ చర్యలు తీసుకోవాల్సింది పోయి, డిస్క్వాలిఫై చేయాల్సింది పోయి వారిని ప్యానల్ స్పీకర్‌గా నియమించడం దేశానికి అవమానకరం. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో, రైతులు “వ్యవసాయం చేయలేము” అని బాధపడుతున్న పరిస్థితిని తాము శాసనసభలో లేవనెత్తామని, రైతు బకాయిలు చెల్లించాలని, రైతుల ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలపై దృష్టి పెట్టాలని పట్టుబట్టిన ప్రభుత్వం స్పందించలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు తమ జీతాల నుంచి కట్టిన నిధులు వేల కోట్ల రూపాయలు ఇంకా పొందలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
రిటైర్డ్ ఉద్యోగులు వైద్యం, కుటుంబ అవసరాలకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని శాసనసభ దృష్టికి తీసుకెళ్ళినా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని చెబుతూ గత ప్రభుత్వాలపై నెపం మోపడం తప్ప, తాము ఏం చేసారో చెప్పడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. కాగ్ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదని స్పష్టంగా వెల్లడైందని పేర్కొంటూ గత బడ్జెట్లో ప్రకటించిన రూ.60,000 కోట్లను కూడా ఖర్చు చేయలేకపోయారని కాగ్ చూపించిందని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి, వాటి పేరుతో అప్పులు తీసుకుంటూ వాటిని బలహీనపరుస్తోందని శంకర్ విమర్శించారు. కొన్ని సంస్థల్లో మూడేండ్లుగా ఆడిట్ కూడా జరగడంలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 53 వేల ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ఉంటే 2014 నుండి దీనిపై సర్వేలు నిర్వహించలేదని చెప్పినా కాగ్ హెచ్చరికలను పట్టించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతోందని చెప్పారు.

More Stories
సోషల్ మీడియాపై పోలీసుల నిఘా.. నేరుగా కేంద్రమే నోటీసులు!
హింస మరింత సంఘర్షణకే దారితీస్తుంది.. దలైలామా హెచ్చరిక
పశ్చిమ ఆసియా దేశాలతో స్థానిక కరెన్సీలలో భారత్ వాణిజ్యం?