నేటి నుండే క్రికెట్ పండుగ ఐపీఎల్ సంబరాలు 

నేటి నుండే క్రికెట్ పండుగ ఐపీఎల్ సంబరాలు 
* బెదిరించిన కర్ణాటక ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు 
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్‌ పండుగ ఐపీఎల్ రానే వచ్చింది. 18 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 19వ సీజన్‌లోకి అడుగుపెడుతున్న ఐపీఎల్‌ శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) జట్ల మధ్య పోరుతో అధికారికంగా తెరలేవనుంది. 
 
గతానికి భిన్నంగా ఈసారి ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్‌ సాదాసీదాగా మొదలుకానుంది.  గతేడాది తొక్కిసలాటలో మరణించిన 11 మందికి నివాళిగా ఈసారి ప్రారంభ కార్యక్రమాన్ని మినహాయించారు. వారికి మద్దతుగా నిలిచేందుకు స్టేడియంలో 11 సీట్లను మృతుల కుటుంబాలకు కేటాయించారు. దీనికి తోడు మ్యాచ్‌ రోజు ఆర్‌సీబీ ప్లేయర్లంతా 11 నంబర్‌ జెర్సీ ధరించి ప్రాక్టీస్‌లో పాల్గొననున్నారు. 
 
ఈ స్టేడియంపై ఉన్న నిషేధాన్ని అధికారులు ఎత్తివేయడంతో, బిసిసిఐ ఇక్కడ 5 మ్యాచ్‌లకు అనుమతి ఇచ్చింది.  గత ఏడాది ఈ మైదానంలో ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 2మ్యాచుల్లో గెలిచి మరో 3 మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ మైదానంలో విరాట్‌ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. 106 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఏకంగా 3,618 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. 
 
బిసిసిఐ తొలి దశలో కేవలం 20 మ్యాచులకు మాత్రమే వేదికలు, తేదీలను ఖరారు చేయగా  గురువారం రెండో దశలో 50 మ్యాచులకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో మొత్తం 70 లీగ్‌ మ్యాచులకూ షెడ్యూల్‌ను బిసిసిఐ ప్రకటించింది. అయితే, ప్లే-ఆఫ్స్‌ వేదికలను ఇంకా ఖరారు చేయలేదు. మార్చి 28 నుంచి మే 24 వరకూ జరిగే లీగ్‌ స్టేజ్‌ మ్యాచ్‌ల వివరాలను ప్రకటించింది. లీగ్‌ స్టేజ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌తో ముగియనుంది. ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరగనుంది. 
 
ఇలా ఉండగా,  ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అమ్ముడవ్వగా  `మేము వీఐపీలం, ఐపీఎల్ టికెట్లు మాకు ఇవ్వరా?’ అని బెదిరించిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల కోసం ఉచితంగా టిక్కెట్లు ఇవ్వాలని కర్ణాటక క్రికెట్ సంఘం ( కేఎస్‌సీఏ) నిర్ణయించింది.  శుక్రవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసిన కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ ఈ వివాదానికి తెరదించారు.  ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఐపీఎల్ ఆరంభ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు. అంతేకాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ. “ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నాలుగు టికెట్లు ఇవ్వాలని స్పీకర్ కోరారు. కానీ, ఇప్పటికే మ్యాచ్ టికెట్లు అమ్ముడయ్యాయి. రేపే మ్యాచ్‌ జరుగనున్నందున టికెట్ల సర్దుబాటుకు సమయం కూడా లేదు” అని చెప్పారు.  “టికెట్లు ఆశిస్తున్న ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. వీరికి ఒకటే టికెట్ దక్కనుంది. అయిత కుటుంబంతో సహా వెళ్లేందుకు వీలుగా ఒక్కొక్కరికి రెండేసీ ఇవ్వాలని కర్నాటక క్రికెట్ సంఘం, ఆర్సీబీ కొత్త యాజమాన్యాన్ని అభ్యర్థించాను” అని పేర్కొన్నారు.
మార్చి 28న జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ కు ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులకు కర్నాటక క్రికెట్ సంఘం టికెట్లు ఇవ్వడం లేదని, కానీ, ప్రభుత్వం నుంచి కేఎస్‌సీఏ అన్నిరకాల ప్రయోజనాలు పొందుతోందని అంటూ  హుంగుండ్ శాసనసభ్యుడు విజయానంద్ పేర్కొనడంతో రగడ మొదలైంది.  కర్ణాటక క్రికెట్ సంఘం ఎమ్మెల్యేలను మాత్రం గౌరవించడం లేదని పేర్కొంటూ ఈ విషయమై ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో లేవనెత్తిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.  ఎమ్మెల్యేలకు కనీసం ఐదు టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరాను అని విజయానంద్ తెలిపారు. అంతేకాదు మైదానంలో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.