* అఖిల పక్ష సమావేశంలో ఐయూఎంఎల్ ఎంపీ మద్దతుపై అధికార, ప్రతిపక్షాల విస్మయం
పశ్చిమ ఆసియా సంక్షోభంపై బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో, ఇండియా కూటమి మిత్రపక్షమైన ఐయూఎంఎల్ ఎంపీ ఒకరు ప్రభుత్వానికి మద్దతు తెలపడంపై అధికార, ప్రతిపక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశంపై పడుతున్న ప్రభావాన్ని, ముఖ్యంగా ఎల్‌పిజి సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వ్యూహాన్ని ప్రశ్నిస్తున్న తరుణంలో ఆయన అభినందించారని ప్రభుత్వ, బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఆ వర్గాల సమాచారం ప్రకారం, రాజ్యసభ ఎంపీ పి.వి. అబ్దుల్ వహాబ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించారు. ఎల్‌పిజి కొరత సమస్యపై భయాందోళనలు సృష్టించకూడదని, పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని హెచ్చరిస్తూనే, తోటి ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన అనేక ఇతర విషయాలపై వహాబ్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు.
“ఇంధన సంక్షోభం అనేది ప్రభుత్వం ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్న ఒక సమస్య. భయాందోళనలకు గురికావడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు కోటి మంది భారతీయుల గురించి మనం ఆందోళన చెందాలి కాబట్టే నేను ఈ మాట చెప్పాను. వారి ప్రయోజనాలకు హాని కలిగించే ఎలాంటి చర్యలు మనం తీసుకోలేము. ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇద్దరూ రోజూ అన్ని వర్గాలతో మాట్లాడుతున్నారని ప్రభుత్వం చెప్పింది,” అని వహాబ్ పేర్కొన్నారు.
“మనం చూస్తున్న ఎల్‌పిజి సంక్షోభం నిల్వల వల్లే ఏర్పడిందని ప్రభుత్వం చెప్పింది. 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎలాంటి సంక్షోభం లేదని మాకు చెప్పారు,” అని వహాబ్ తెలిపారు. వహాబ్ మద్దతు ప్రభుత్వానికి ఒక “ఆహ్లాదకరమైన ఆశ్చర్యం” అయినప్పటికీ, పలువురు ప్రతిపక్ష నాయకులను సహితం ఆశ్చర్యపరిచింది. అటువంటి నాయకులలో ఒకరి ప్రకారం, ఆ ఐయూఎంఎల్ ఎంపీ “నిశ్శబ్దంగా ఉన్నారు… ఆయన మాట్లాడినప్పుడు మనం భయాందోళనలు సృష్టించకూడదని చెప్పారు. మన ప్రజలు అక్కడే ఉన్నారని, వారిని వెనక్కి రప్పించేలా మనం ఎలాంటి పనులు చేయకూడదని అన్నారు.”
ఐయూఎంఎల్ నాయకుడి ప్రసంగంలో పాలస్తీనా సమస్య గురించి కూడా ఎటువంటి ప్రస్తావన లేదని మరో నాయకుడు చెప్పారు. ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్న కేరళలో, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)లో ఐయూఎంఎల్ ఒక కీలక భాగస్వామి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ఇరాన్‌పై అమెరికా దాడి విషయంలో ప్రభుత్వం మౌనం వహించడం, ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన సమయం, ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించకపోవడం వంటి ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని పలువురు ప్రతిపక్ష నాయకులు విమర్శించారు.
ఎల్‌పిజి సంక్షోభం లేదన్న ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ, వ్యూహాత్మక నిల్వలు ఎల్‌పిజి కోసం కాదని, దేశానికి ఇప్పటికీ దిగుమతులు అవసరమని ప్రతిపక్ష నాయకులు ఎత్తి చూపారు. పశ్చిమ ఆసియా సంఘర్షణపై ఉభయ సభలలో చర్చ జరపాలన్న ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించనందున, ఈ సమావేశం “అసంతృప్తికరంగా” ఉందని కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ అభివర్ణించారు.
అయితే, చమురు, గ్యాస్ సరఫరా మార్గాలలో ఏర్పడే అంతరాయాలను ఎదుర్కోవడానికి దేశం సన్నద్ధతతో సహా కీలక అంశాలపై ప్రభుత్వం సవివరమైన వివరణ ఇచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. “ప్రభుత్వం అందరి ఆందోళనలను పరిష్కరించింది. ఈ సమావేశంలో అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం), అబ్దుల్ వహాబ్, సర్ఫరాజ్ అహ్మద్ (జేఎంఎం), మియాన్ అల్తాఫ్ అహ్మద్ (నేషనల్ కాన్ఫరెన్స్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), తారిఖ్ అన్వర్ (కాంగ్రెస్) అనే ఆరుగురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలకు మేము స్పందించాము” అని తెలిపారు.
“భయాందోళనల కారణంగా నిల్వలు జరుగుతున్నాయని, ఓవర్‌బుకింగ్ జరుగుతోందని ప్రభుత్వం ప్రతిపక్షానికి చెప్పింది. ఎల్‌పిజిని ఉపయోగించే కుటుంబాల సంఖ్య 2009లో 14 కోట్ల నుండి 34 కోట్లకు పెరిగిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన ఎల్‌పిజిలో ఎనభై శాతం ఖతార్ నుంచే వస్తుంది,” అని ఒక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

More Stories
ఖార్గ్ ద్వీపం కోసం అమెరికా, ఇరాన్ సేనల మోహరింపు
ఆపరేషన్ సిందూర్‌పై వివేక్ అగ్నిహోత్రి సినిమా
అన్ని పార్టీల విరాళాలకంటే బిజెపికి 10 రెట్లు అధికం