గతేడాది కలకలం రేపిన దిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రఫీయాబాద్, హంద్వారా, కుప్వారా, కుల్గాంతోపాటు మరికొన్ని ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉగ్ర కేసుతో లింకులకు సంబంధించి ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
హంద్వారాలోని గులూరా ప్రాంతంలో ఒక వ్యాపారవేత్త ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కుల్గాం జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలోని అనుమానిత ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై జరుగుతున్న విస్తృత దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు.
అలాగే రఫీయాబాద్లోని బోనపోరా షట్లూ ప్రాంతంలో ఉన్న డాక్టర్ బిలాల్ నసీర్ మల్లా ఇంటిపై దర్యాప్తు సంస్థ సోదాలు చేసింది. ఢిల్లీ బ్లాస్ట్ కేసుకు సంబంధించి ఇప్పటికే డాక్టర్ నసీర్ మల్లాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దర్యాప్తు సంస్థ ప్రకారం, పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీకి లాజిస్టిక్ సహాయం అందించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి ఆరోపణలు మల్లాపై ఉన్నాయి.
అయితే ఆ కేసుకు సంబంధించి మార్చి మొదటి వారంలోనే పుల్వామా, కుల్గాం శోపియాన్, బారాముల్లా, కుప్వాడా జిల్లాల్లో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. దీంతో దర్యాప్తు చేసేందుకు ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే విచారణ గడువును 45 రోజులు పెంచినట్లు సమాచారం.
ఢిల్లీ పేలుడులో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆయుధాలు సరఫరా చేసిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎన్‌ఐఏ అధికారులు చెప్పారు. వీరంతా స్లీపర్ సెల్స్‌గా ఉంటూ ఉగ్ర సంస్థలకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపారు. వీరి అరెస్టుతో ఈ కేసులో మొత్తం అరెస్టయినవారి సంఖ్య 11కి చేరిందన్నారు.

More Stories
జైళ్లలో రద్దీపై సుప్రీంకోర్టు ఆందోళన
వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్
నిందితుల ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో.. సుప్రీం ఆందోళన