మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్ట్ పూర్తిగా ఆచరణయోగ్యంగా కనిపించడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. వేల ఎకరాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా రైతుల జీవనోపాధి నష్టపోతుందిని పేర్కొంటూ హైదరాబాద్ నగరానికి వచ్చే కూరగాయలలో పెద్ద భాగం మూసీ పరివాహక ప్రాంతం నుంచే వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
`మూసీ నది పునరుజ్జీవనం – వాస్తవాలు’ అంశంపై బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నది శుభ్రపడాలి, నీరు స్వచ్ఛంగా ఉండాలని, కానీ దాని పేరుతో పేదల ఇండ్లు కూల్చడానికి వ్యతిరేకిస్తామని తెలిపారు. మొదట రూ.5,000 కోట్లుగా చెప్పిన ప్రాజెక్ట్, కొన్ని రోజుల్లోనే రూ.7,000 కోట్లకు పెరిగిందని చెబుతూ ఖర్చులపై స్పష్టత లేదని చెప్పారు.
ముందుగా నిర్వాసితులకు పునరావాసం జరగాలని, కానీ ఇక్కడ “ముందు కూల్చి, తర్వాత ఇస్తాం” అనే విధానం కనిపిస్తోందని విమర్శించారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో 10 వేల ఇండ్లు కూల్చుతామని అంటోందని, మరోవైపు కాంగ్రెస్ మంత్రి అసెంబ్లీలో 1,400 ఇండ్లు మాత్రమే అంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ల వరకు బఫర్ జోన్ పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఒకచోట పెద్ద బిల్డర్లకు బఫర్ జోన్ నియమాలు వర్తించకపోతే, మరోచోట మధ్యతరగతి, ఎక్స్ సర్వీస్ మెన్ల ఇళ్లను కూల్చడం ఎందుకు? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు & కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ ప్రసంగిస్తూ మూసీ నది పునరుజ్జీవనం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికల్లో అసలు శాస్త్రీయ దృష్టికోణం కనిపించడం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు & కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ తెలిపారు.
జీవం లేని నదిపై కేవలం అలంకరణ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ముందుగా నది ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం అత్యవసరమని స్పష్టం చేశారు. నదిలో చేపలు జీవించగలగడం, నీటి నాణ్యత మెరుగుపడడం వంటి సూచికల ద్వారా మాత్రమే పునరుజ్జీవనం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. మూసీ నది మొత్తం పరివాహక ప్రాంతాన్ని ఒకే వ్యవస్థ కింద నిర్వహించడానికి “మూసీ రివర్ బేసిన్ అథారిటీ” ఏర్పాటు చేయాలని సూచించారు.
వికారాబాద్ నుంచి కృష్ణా నది వరకు మొత్తం నది పై ఒక సమగ్ర బేసిన్ ప్లాన్ ఉండాలని తెలిపారు. ఎన్విరాన్మెంటల్ ఫ్లో, పొల్యూషన్ లిమిట్స్, దీర్ఘకాలిక ప్రణాళికలతో నది పునరుద్ధరణ జరగాలని సూచించారు.

More Stories
ఆత్మాభిమానం చంపుకొని కాంగ్రెస్లో కొనసాగలేను
23న బిజెపి తెలంగాణ అసెంబ్లీ ముట్టడి
తెలంగాణ బడ్జెట్ అత్యంత నిరాశాజనకం