ఇజ్రాయిల్ సైన్యం టెహ్రాన్‌పై శనివారం పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరిపింది. పర్షియన్ నూతన సంవత్సరమైన నౌరజ్ను ఇరాన్ ప్రజలు జరుపుకుంటున్న వేళ ఈ దాడులు జరిగాయి. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్‌లోని రమ్సార్ నగరంపై అమెరికా-ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఓ ఇల్లు ధ్వంసం కాగా అందులో నివసిస్తున్న దంపతులు, వారి చిన్నారి మరణించారు.
మరోవంక, ఈద్ అల్-ఫితర్ రోజున ఇరాన్ క్షిపణి జెరూసలేంపై దాడి చేసింది. అది అల్-అక్సా మసీదుకు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో పడింది. దీంతో వందలాది మంది ముస్లిం భక్తులు పాత నగరం (ఓల్డ్ సిటీ) తలుపులు మూసివేసి బయట తమ ఈద్ ప్రార్థనలు చేసుకోవలసి వచ్చింది. దాదాపు 60 ఏళ్లలో మొదటిసారిగా వారిని నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.
ఇరాన్ క్షిపణులు రాబోతున్నాయని హెచ్చరికలు వచ్చిన తర్వాత, శుక్రవారం జెరూసలేం పాత నగరం లోపల ఒక కొండపైన పేలుడు సంభవించి, ఒక గొయ్యి ఏర్పడింది. దాని శిథిలాలు ఒక రహదారిపై చెల్లాచెదురుగా పడ్డాయి. కాగా, ఇజ్రాయిల్-అమెరికాపై దాడులు క్షిపణులు, డ్రోన్లు, టార్పెడోలు, యుద్ధభూమికే పరిమితం కావని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు.
ఈద్, నౌరజ్ వేడుకల సందర్భంగా ఆయన ఓ సందేశాన్ని ఇస్తూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అంతర్జాతీయ సమాజ దురహంకార ధోరణిని అవిశ్రాంతంగా ప్రతిఘటిస్తున్న దేశ ప్రజానీకానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇస్లామిక్ దేశాలన్నీ ఐక్యంగా ఉండాలని ఈద్ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పిలుపునిచ్చారు.
‘మనమంతా సోదరులం. మీతో మాకేమీ విభేదాలు లేవు. మా వివాదమంతా ఇజ్రాయిల్తోనే’ అని ఇస్లామిక్ దేశాలకు, పొరుగువారికి ఆయన సందేశాన్ని ఇచ్చారు. కాగా నౌరజ్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ నాయకత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఇలా ఉండగా, తమ శతృదేశాలతోపాటు, అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరించే దేశాల్లోని పర్యాటక కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఆయా దేశాల్లోని రిక్రియేషనల్ పార్కులు, ఇతర టూరిస్ట్ డెస్టినేషన్స్ లక్ష్యంగా చేసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ సైనిక అధికారి జనలర్ అబోల్ఫాజి షెకార్చి హెచ్చరించారు. అంటే, ఇకపై వైమానిక దాడులే కాకుండా తీవ్రవాద దాడులకు కూడా పాల్పడుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇరాన్‌లోని నంటాజ్ అణుకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్-అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది. నంటాజ్ అణుకేంద్రంపై శనివారం ఉదయం మిస్సైళ్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది.
అయితే, ఈ దాడుల్లో అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి లీకేజీ, రేడియేషన్ లేదని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్‌కు నంటాజ్ అణుకేంద్రం చాలా కీలకం. ఈ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇది రెండోసారి. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే ఈ కేంద్రంపై దాడి జరిగింది. అప్పుడు సమీపంలోని కొన్ని బిల్డింగులు ధ్వంసమయ్యాయి. అయితే, అప్పుడు కూడా ఎలాంటి రేడియోధార్మికత విడుదల కావడం లేదని ఇరాన్ సహా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
ఈ అణుకేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గత ఏడాది జూన్‌లో జరిగిన వైమానిక దాడుల సందర్భంగా కూడా ఇజ్రాయెల్ ఈ కేంద్రంపై దాడికి పాల్పడింది. ఇరాన్‌పై దాడిని త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం విశేషం. ఇరాన్ యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలకు చేరింది.
మరోవంక, తమపై దాడుల కోసం అమెరికా దళాలకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకునే అవకాశం ఇస్తుందనే వార్తల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ వివాదంలో బ్రిటన్ జోక్యం శ్రుతి మించితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు.
“ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న ఈ యుద్ధంలో భాగం కావాలని బ్రిటన్ ప్రజల్లో అధిక శాతం మంది కోరుకోవడం లేదు. కానీ వారి ప్రధాని స్టార్మర్ మాత్రం సొంత ప్రజల అభిప్రాయాన్ని విస్మరించి, ఇరాన్‌పై దాడికి యూకే స్థావరాలను వినియోగించుకునే అవకాశం ఇస్తున్నారు. తద్వారా ఆయన బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు” అంటూ వారించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవడానికి ఇరాన్ వెనుకాడదని అరాఘ్చీ స్పష్టం చేశారు. ఈ వివాదం తమది కాకపోయినా బ్రిటన్ అనవసరంగా తలదూరుస్తోందని పరోక్షంగా మండిపడ్డారు.

More Stories
ఆర్ఎస్ఎస్పై అమెరికా నివేదిక పట్ల మేధావుల ఆగ్రహం
ఇరాన్ పై దాడులను అరికట్టడంలో ‘బ్రిక్స్’ జోక్యం చేసుకోవాలి
పాశ్చాత్య గుర్తింపు కోసం భారతీయ వంటకాలు ఆరాటం