ఆధునిక యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయ్‌

ఆధునిక యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయ్‌

ఆధునిక యుద్ధాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను, సైబర్ స్పేస్‌ ను దెబ్బతీస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.  నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని చెబుతూ యుద్ధాలు సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహారభద్రతలో భాగమయ్యాయని తెలిపారు.  ఈ యుద్ధాల ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. 

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రతి దేశపౌరుడు అన్ని సమయాల్లో దేశ రక్షణకు సిద్ధమై ఉండాలని రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. ఆధునిక యుద్ధాలకు అనుగుణంగా దేశంలో ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.  ఇందులోభాగంగా సాయుధ దళాలకు ఆధునాతన, స్వదేశీ ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

దేశ రక్షణలో యువత తనవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌లోని సైనిక పాఠశాల ఆవిర్భావ దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ యువత దేశం కోసం ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగేలా క్రమశిక్షణ, మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలని సూచించారు.  సైన్యం, పౌరులు బలంగా ఉంటేనే దేశం ముందుకు సాగుతుందని తెలిపారు.

దేశ రక్షణలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్‌సీసీలో ప్రవేశాల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గతంలో 17 లక్షలుగా ఉన్న నియామకాలను 20 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.  పీపీపీ నమూనాలో దేశవ్యాప్తంగా 100 కొత్త సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సైనిక పాఠశాలల్లో బాలికలు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారని, ఇది చారిత్రాత్మక ముందడుగు అన్నారు. ఇది దేశ ‘నారీ శక్తి’ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.