ప్రజలు ఆందోళనతో ఎల్‌పీజీ వంటగ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడం తగ్గిపోయిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ వెల్లడించింది. గురువారం రోజు కేవలం 55 లక్షల ఎల్‌పీజీ సిలిండర్లనే బుక్ చేసుకున్నారని ఆ శాఖ జాయింట్ సెక్రెటరీ సుజాత శర్మ చెప్పారు. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ వంటగ్యాస్ సిలిండర్ల సప్లైలో ఎలాంటి కొరతా లేదని ఆమె తేల్చి చెప్పారు.
భారతదేశ అవసరాలకు సరిపడా ఎల్‌పీజీ వంటగ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఏ ఒక్క వంటగ్యాస్ సప్లై ఏజెన్సీలోనూ స్టాక్ అయిపోవడం అనేది జరగలేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ ఎల్‌పీజీ అంశం కొంత ఆందోళనకరంగానే ఉందని సుజాత శర్మ పేర్కొన్నారు.
“పశ్చిమాసియా యుద్ధం మొదలు కావడానికి ముందు దేశంలో రోజూ సగటున 50 లక్షల నుంచి 55 లక్షల ఎల్‌పీజీ వంటగ్యాస్ సిలిండర్లు బుక్ అయ్యేవి. వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు మార్చి 13న ఏకంగా 87.7 లక్షల సిలిండర్లను బుక్ చేసుకున్నారు. కానీ ఈవిధమైన ప్యానిక్ బుకింగ్ తగ్గిపోయి, గురువారం నాటికి 55 లక్షలకు చేరింది” అని ఆమె చెప్పారు.
“గత రెండువారాల వ్యవధిలో దేశంలో ఎల్‌పీజీ వంటగ్యాస్ ఉత్పత్తిని 40 శాతానికిపైగా పెంచాం. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తొలినాళ్లలో వాణిజ్య సిలిండర్ల సప్లైను కొన్నిరోజులు ఆపాం. కానీ ఆ తర్వాత వాణిజ్య సిలిండర్ల కస్టమర్ల గ్యాస్ అవసరాలను ఐదోవంతు మేర తీర్చడం మొదలుపెట్టాం. గతవారం రోజుల వ్యవధిలో వాణిజ్య సిలిండర్ల కస్టమర్లకు 11,300 టన్నుల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లను సప్లై చేశాం” అని చెప్పారు.
ఈనేపథ్యంలో దేశంలోని 15 ప్రాంతాల్లో 13,700 మంది కొత్తగా పీఎన్‌జీ పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారని, మరో 7వేల మంది వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల కస్టమర్లు కూడా పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్లకు మారిపోయారని సుజాత శర్మ వెల్లడించారు.
“ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్‌ను వినియోగించే కస్టమర్ల వైఖరిలో చాలా మార్పు వచ్చింది. 7.5 లక్షల మంది ఎల్‌పీజీ యూజర్లు పీఎన్‌జీ పైప్డ్ గ్యాస్‌కు మారిపోయారు. ఇంధన సప్లైలను పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా పర్యవేక్షణా యంత్రాంగాలను బలోపేతం చేశాం. 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కంట్రోల్ రూంలు, జిల్లా మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు” అని ఆమె వివరించారు.
ఇంధన సరఫరాలో అవకతవకలను అడ్డుకునేందుకు గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,500 సోదాలు నిర్వహించారని, ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 1100 దాడులు చేశారని ఆమె చెప్పారు. దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) 1800 ఆకస్మిక తనిఖీలను నిర్వహించాయిని తెలిపారు.

More Stories
పవర్/ప్రీమియం పెట్రోల్ ధరలు పెంపు
యుద్ధ సంక్షోభంతో నాలుగు నెలల్లో ప్రపంచ ఆర్థిక మాంద్యం
17 శాతం ఎల్ఎన్జీ ఎగుమతుల సామర్థ్యం కోల్పోయిన ఖతార్