పవర్/ప్రీమియం పెట్రోల్ ధరలు పెంపు

పవర్/ప్రీమియం పెట్రోల్ ధరలు పెంపు

దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్‌కు రూ.2.09 నుంచి రూ.2.35 వరకు పెంచినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. పారిశ్రామిక వినియోగదారులకు విక్రయించే బల్క్ డీజిల్ ధరను లీటరుకు సుమారు రూ. 22 పెంచాయి. ముఖ్యంగా హై ఆక్టేన్ పెట్రోల్ వినియోగదారులకు ఆ పెంపు ప్రభావం చూపనుంది.  శుక్రవారం నుంచే సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి.

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) తమ పవర్ పెట్రోల్ ధరను పెంచినట్లు ప్రకటించగా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) స్పీడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఎక్స్‌పీ95 బ్రాండ్లకు కూడా ఇదే పెంపు వర్తించింది.  అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగించే అంశంగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో మూడు రకాల పెట్రోల్ అందుబాటులో ఉన్నాయి.

సాధారణ పెట్రోల్, ప్రీమియం పెట్రోల్, హై ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ అనే విభాగాలుగా ఇవి వర్గీకరించబడుతున్నాయి.  వీటిలో ప్రీమియం లేదా పవర్ పెట్రోల్ అధిక పనితీరు కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బైకులు, లగ్జరీ కార్లు, సూపర్ కార్లలో ఈ ఇంధనాన్ని వినియోగించడం ఎక్కువగా కనిపిస్తోంది. పెట్రోల్ నాణ్యతను ఆక్టేన్ విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ విలువ సుమారు 87 కాగా, ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ విలువ 91 వరకు ఉంటుంది. 

ఆక్టేన్ విలువ ఎక్కువగా ఉంటే ఇంధనం ఎక్కువ కంప్రెషన్‌ను తట్టుకోగలదు. దీని వల్ల ఇంజిన్ పనితీరు మెరుగుపడటంతో పాటు ఇంధన వినియోగం సమర్థవంతంగా ఉంటుంది. అలాగే ఇంజిన్‌లో కార్బన్ పేరుకుపోవడం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.