పెళ్లి చేసుకుంది జీవిత భాగస్వామిని.. సేవకురాలిని కాదని

పెళ్లి చేసుకుంది జీవిత భాగస్వామిని.. సేవకురాలిని కాదని
వంట, క్లీనింగ్ పనుల్లో భర్తలు పాలు పంచుకోవాలని, పెళ్లి చేసుకున్నది జీవిత భాగస్వామిని, సేవకురాలిని కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక బంధంలో సమానత్వం అత్యంత ముఖ్యమని, భార్యను పనిమనిషిలా చూడొద్దని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇంటి పనుల్లో భార్యతో పాటు భర్తలు కూడా బాధ్యత పంచుకోవాలని సూచించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పురుషులు తమ ఆలోచనలు మార్చుకోవాలని సూచించింది. 
 
ఇంటి పనుల్లో సమాన భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆ బంధం నిలబడుతుందని తెలిపింది. వంట చేయడం సహా ఇంటి పనులను భార్య నిర్వర్తించకపోవడం క్రూరత్వం కిందకు రాదని ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్‌ విక్రమ్ నాథ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.  తన భార్య ఇంటి పనులు చేయడం లేదని, తనను, కుటుంబ సభ్యుల్ని చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని, ఈ నేపథ్యంలో ఆమె నుంచి విడాకులు కావాలని కోరుతూ ఒక వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.
ఒక జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లైన వారం తర్వాత నుంచి భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని భర్త ఆరోపించాడు.  తనను సరిగ్గా చూసుకోవడం లేదని, వంట చేయడం లేదని ఆరోపించాడు. అలాగే, తన తల్లిదండ్రుల్ని కూడా అసభ్య పదజాలంతో తిడుతోందన్నాడు. తనకు కొడుకు పుట్టినా, నామకరణానికి కూడా తనను, కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించలేదని కోర్టుకు తెలిపాడు. అందువల్ల ఆమె నుంచి విడాకులు కావాలని కోరాడు. 
 
దీనిపై భార్య స్పందించింది. తను ప్రెగ్నెన్సీ సమయంలో భర్త, అత్తవారింటి అనుమతితోనే డెలివరీకి పుట్టింటికి వెళ్లానని, నామకరణానికి పిలిచినా వాళ్లు రాలేదని తెలిపింది. నగలు, డబ్బు కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపింది. ఇరువురి వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు మధ్యవర్తిత్వానికి ఆదేశించింది. ఇరువురికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.దీంతో భర్త విజ్ఞప్తి మేరకు ఇరువురికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కానీ, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల్ని సవాలు చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులపై స్టే విధించింది. దీంతో భర్త హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను పెళ్లి చేసుకుంది పని మనిషిని కాదని, జీవిత భాగస్వామిని అనే విషయం గుర్తు పెట్టుకోవాలని భర్తకు న్యాయస్థానం  సూచించింది.