తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యంగా విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి గత ఏడాది కంటే రూ. 1000 కోట్లు పెంచినట్లు చూపిస్తున్నా, బడ్జెట్‌లో దీని వాటా కేవలం 8 శాతం మాత్రమేనని గుర్తు చేశారు.
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (13%), బీహార్ (21%) తమ బడ్జెట్‌లో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతలో సగం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. ‘ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు’ అని గొప్పలు చెప్పడం తప్ప, విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఒక్క ప్రయత్నం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా చెల్లించలేని రేవంత్ ప్రభుత్వం, పెన్షన్లు, ఇతర బెనిఫిట్లను కూడా ఆరోగ్యశ్రీ డిపార్ట్‌మెంట్‌కే అప్పగించడం అంటే ఆ సంస్థను కూడా దివాళా తీయించడమేనని హెచ్చరించారు.
అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా ‘ఫ్యూచర్ సిటీ’ అని ఫ్యాన్సీ పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అన్నీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ పథకాల వల్ల వచ్చినవేనని స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్, దాని పక్కన వచ్చే రీజనల్ రింగ్ రైల్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ అని, కేవలం భూసేకరణ తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని ఎండగట్టారు.
రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని రాంచందర్ రావు మండిపడ్డారు. ఐదు దఫాలుగా రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా, సరిగ్గా ఇవ్వకుండా ఇంకా ప్రతి రైతుకు ఇంకా సుమారు ఎకరాకు రూ. 45,000 కి పైగా బాకీ పడి ఎగ్గొట్టారని విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 4000 నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఆర్థిక సాయం గురించి కానీ ఈ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ సర్కారు మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ ఢిల్లీలో తుర్క్మాన్ గేట్ వద్ద పేదల ఇళ్లు కూలగొట్టిన ‘మైండ్ సెట్’ తోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయం రెండు రోజుల్లోనే రూ. 5000 కోట్ల నుండి రూ. 7000 కోట్లకు ఎలా పెరిగిందని రాంచందర్ రావు నిలదీశారు.
దేవాలయాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. అర్చకుల వేతనాలు పెంచాలని, ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్ పెంచాలన్న డిమాండ్లను పట్టించుకోకుండా, కేవలం మైనారిటీ బడ్జెట్‌ను రూ. 700 కోట్లు పెంచడం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో భాగమేనని విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని మూడు ముక్కలు చేసి జీహెచ్ఎంసికి బడ్జెట్ కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
More Stories
రూ. 3. 24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
రామరాజ్య ఆదర్శాలతో బలమైన దేశనిర్మానం
కాంగ్రెస్ అస్సాం ఎన్నికల ఇన్ ఛార్జ్ గా ప్రియాంకకు చుక్కెదురు