తొలిసారిగా ఎఫ్-35 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి

తొలిసారిగా ఎఫ్-35 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి
ప్రపంచంలోనే తొలిసారిగా 100 మిలియన్ డాలర్ల విలువైనఅమెరికా ఐదోతరం ఎఫ్-35 లైట్నింగ్2 యుద్ధ విమానంపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున 2.50 గంటలకు సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఎఫ్-35‌ స్టెల్త్ ఫైటర్ జెట్‌పై అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా దాడి చేశామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది. 

ఆ యుద్ధ విమానం కూలిపోయే అవకాశాలే చాలా ఎక్కువని, కానీ దాడి తర్వాత దానికి ఏం జరిగిందనేది తమకు తెలియదని పేర్కొంది.  యుద్ధంలో పాల్గొంటున్న ఆ విమానాన్ని.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్ లాక్ చేసి కొట్టేసింది. అక‌స్మాత్తుగా భారీ పేలుడు సంభ‌వించి, ఆ విమానం గ‌తిత‌ప్పింది. ఆ దృశ్యాలు వీడియోలో క‌నిపించాయి. ఇప్పటివరకు 125కుపైగా అమెరికా, ఇజ్రాయెలీ డ్రోన్లను సైతం కూల్చామని చెప్పింది.

కాగా,  తమ ఎఫ్-35 యుద్ధ విమానం ఒకటి పశ్చిమాసియాలోని ఓ వైమానిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ అంగీకరించారు.  అయితే యుద్ధ విమానంతో పాటు పైలట్ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. ఇరాన్ సైన్యం ఉపరితలం నుంచి గగనతలం దిశగా వరుస మిస్సైళ్లను సంధించాకే, ఎఫ్-35 యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా నిర్ణయాత్మక శక్తి ఎఫ్-35 యుద్ధ విమానాలే అంటూ వైట్‌హౌస్ మార్చి 17న ఒక ట్వీట్ చేసింది.  ఈ పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే ఒక ఎఫ్-35 ఫైటర్ జెట్‌పై ఇరాన్ దాడి చేయడం గమనార్హం. దీన్నిబట్టి ఇరాన్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలలో కొత్త అప్‌గ్రేడ్‌లు జరిగి ఉండొచ్చని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంలో ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు చాలానే షాకింగ్ పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

అయితే  కొన్ని సాంకేతిక పొరపాట్లు కూడా అందుకు కారణమయ్యాయి. కువైట్‌ దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు పొరపాటున జరిపిన ఫైరింగ్‌లో ఏకంగా మూడు ఎఫ్-15 ఈగల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. కానీ ఆ విమానాల్లోని ఆరుగురు అమెరికన్ సిబ్బంది సేఫ్‌గా బయటపడ్డారు.  గతవారమే ఇరాక్‌లోని పశ్చిమ ప్రాంతంలో కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం కూలిపోయింది. అది ఎందుకు కూలిపోయింది అనేది ఇప్పటికీ గుర్తించలేకపోయారు.

ఇరాన్ దాడి వల్లో, అమెరికా గగనతల రక్షణ వ్యవస్థల మిస్ ఫైరింగ్ వల్లో ఈ విమానం కూలలేదని అమెరికా సైన్యం అంటోంది. ఇక అసలు కారణమేంటో తెలియాల్సి ఉంది. కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం కూలిన ఘటనలో ఆరుగురు అమెరికన్ సిబ్బంది చనిపోయారు.