తీవ్ర ఇంధన సంక్షోభంలో పాకిస్థాన్‌

తీవ్ర ఇంధన సంక్షోభంలో పాకిస్థాన్‌

పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో కేవలం 10 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలు మాత్రమే ఉండటం ఇంధన భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రాచ్యం లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. పెట్రోలియంపై ఏర్పాటైన సెనేట్ స్టాండింగ్ కమిటీకి అధికారులు ఈ వివరాలు అందించారు. 

ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దేశం, ఇప్పుడు ఇంధన, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో, ప్రతి ఏటా మార్చి 23న ఇస్లామాబాద్‌లో అట్టహాసంగా జరగాల్సిన రిపబ్లిక్ డే పెరేడ్ ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న కేవలం జెండా ఆవిష్కరణ కార్యక్రమం మాత్రమే జరుగుతుంది. ప్రతి ఏటా నిర్వహించే సైనిక కవాతు ఉండదు. 31 గన్ సెల్యూట్, రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలను పూర్తిగా రద్దు చేశారు.

దేశంలో ప్రస్తుతం 20 రోజులకు సరిపడా డీజిల్, 26 రోజులకు పెట్రోల్, 8 రోజులకు ఎల్పీజీ, 13 రోజులకు విమాన ఇంధనం నిల్వలు ఉన్నాయని పెట్రోలియం కార్యదర్శి తెలిపారు. పాకిస్థాన్ తన పెట్రోలియం అవసరాల్లో దాదాపు 70 శాతం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటోంది. తాజా ఘర్షణల కారణంగా కీలకమైన నౌకా మార్గాలు దెబ్బతిన్నాయి. ఎర్ర సముద్రం మీదుగా సరుకు రవాణాకు గతంలో 4-5 రోజులు పట్టగా, ఇప్పుడు 12 రోజులు పడుతుంది.

మరోవైపు పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం కూడా పొంచి ఉంది. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో తీవ్రమైన ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) కొరత ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు. మార్చిలో రావాల్సిన ఎనిమిది ఎల్ఎన్‌జీ కార్గోలలో కేవలం రెండే పాకిస్థాన్‌కు చేరాయి. 

ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హ‌ర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అనుమతి కోసం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నది. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం ప్రతిరోజూ ఇంధన నిల్వలపై సమీక్ష నిర్వహిస్తున్నది. ప్రస్తుతానికి మార్చి నెలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ఏప్రిల్ మధ్య వరకు సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.