73 మంది రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు

73 మంది రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
* సంపన్న ఎంపీలలో తెలుగు వారే ముందంజ 
 
ప్రస్తుత రాజ్యసభలో 73 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు తెలియచేసుకున్నారు. ఈ విధంగా మొత్తం సభలో 32 శాతం మంది వరకూ క్రిమినల్ చరిత్ర ఉందని వెల్లడైంది. కాగా ఈ సభలో 31 మంది బిలియనీర్లు ఉన్నారు. సంబంధిత వివరాలను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్) తమ నివేదికలో తెలిపింది.  మొత్తం 233 మంది ఎంపీలలో 229 మంది అఫిడవిట్ల పరిశీలన క్రమంలో సభ్యుల రికార్డులు తెలిసివచ్చాయి.
ఇటీవలే ఎన్నికైన రాజ్యసభ ఎంపీల అఫిడవిట్ల విశ్లేషణ కూడా ఈ నివేదికలో పొందుపర్చారు. రాజ్యషభలో 14 శాతం వరకూ పరమ కోటీశ్వరులు ఉన్నట్లు నిర్థారణ అయింది. ఇక క్రిమినల్ రికార్డులు ఉన్న వారిలో 73 మంది అంటే 32 శాతం వరకూ తమపై తీవ్ర అభియోగాలు ఉన్నట్లు తెలియచేసుకున్నారు. ఓ ఎంపీపై హత్య కేసు, నలుగురిపై హత్యాయత్నం కేసులు, ముగ్గురిపై మహిళలపై అఘాయిత్యాల కేసులు ఉన్నాయి.
 
ఇక పార్టీల వారిగా చూస్తే బిజెపి ఎంపీలలో 99 మందిలో 27 మందిపై కేసులు ఉన్నాయి. కాగా కాంగ్రెస్‌కు చెందిన 28 మంది సభ్యులలో 12 మందిపై, టిఎంసికి చెందిన 13 మందిలో నలుగురుపై, టిఎంసికి చెందిన పది మందిలో నలుగురుపై కేసులు ఉన్నాయి. బిఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎంపిపై క్రిమినల్ కేసు ఉంది. సిపిఎంకు చెందిన ముగ్గురు ఎంపిలపై కేసులు రికార్డు అయి ఉన్నాయి. 
 
ఇక ఆస్తుల విషయానికి వస్తే  31 మంది బిలియనీర్లు ఉండగా వారిలో తెలుగు రాష్ట్రాల ఎంపీలే 9మంది ఉన్నారు. వారిలో నలుగురు తెలంగాణకు, ఐదుగురు ఏపీకి చెందినవారు. అత్యధిక ఆస్తులున్న ఎంపీల్లో బండి పార్థసారథి (బీఆర్‌ఎస్‌) రూ.5,300 కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఆప్‌ ఎంపీ రాజీందర్‌ గుప్తా (రూ.5,053 కోట్లు), మూడో స్థానంలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి (రూ.2,577 కోట్లు) ఉన్నారు.  టాప్‌ 10 బిలియనీర్లలో తెలుగు రాష్ట్రాల నుంచి బండి పార్థసారథితో పాటు అయోధ్య రామిరెడ్డి, అభిషేక్‌ మను సింఘ్వీ, మేడా రఘునాథ్‌ రెడ్డి ఉన్నారు.
31 మంది బిలియనీర్లలో బీజేపీ (6), కాంగ్రెస్‌ (5), వైసీపీ (4), బీఆర్‌ఎస్‌ (2), టీడీపీకి చెందిన ఒకరు ఉన్నారు. ఆప్ ఎంపి సంత్ బల్బీర్ సింగ్ తమ ఆస్తుల విలువ దాదాపు 3 లక్షలని తెలియచేసుకున్నారు. ఎంపిల ఆస్తుల విలువ చూస్తే ఆయనే నిరుపేద అని తేలింది. రాజ్యసభ ఎంపీల సగటు ఆస్తి రూ.120.69 కోట్లు అని నివేదిక పేర్కొంది.  రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.27,638 కోట్లు కాగా, రాష్ట్రాలవారీగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీలు అత్యధికంగా మొత్తం రూ.8,130 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు.
పంజాబ్‌ రెండో స్థానంలో ఉండగా, ఏపీ మూడో స్థానంలో ఉంది.  పార్టీల వారీగా అత్యధికంగా ఆప్‌కు చెందిన 10 మంది ఎంపీలు మొత్తం రూ.5,740 కోట్లు, బీఆర్‌ఎ్‌సకు చెందిన ముగ్గురు ఎంపీలు రూ.5,524 కోట్లు, వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీలు మొత్తం రూ.3,658 కోట్లు ఆస్తులు కలిగి ఉన్నారు. పార్టీలవారీగా ఎంపీల సగటు ఆస్తుల్లో ఆప్‌ (రూ.574.09 కోట్లు) ముందుంది. రెండో స్థానంలో ఏడుగురు వైసీపీ ఎంపీలు రూ.522.63 కోట్ల సగటు ఆస్తులు కలిగి ఉన్నారు.