పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం.. సుప్రీం సూచన 

పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం.. సుప్రీం సూచన 

పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. పిల్లలు, వారి తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా సెలవులను నిర్ణయించాలని పేర్కొంది. మాతృత్వ సెలవులపై కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మంగళవారం పితృత్వ సెలవులపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.  తండ్రులకు కూడా సెలవులు ఉండాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని పేర్కొంది. తండ్రికి కూడా సమాన బాధ్యత ఉంటుందని తెలిపింది. మాతృత్వ సెలవుల తరహాలోనే.. వేతనంతో కూడిన పితృత్వ సెలవులు కల్పించాలని సూచించింది.  పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష తగ్గాలంటే ఇలాంటి చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. పితృత్వ సెలవులు ప్రైవేట్ రంగంలోనూ అమలు చేసేలా నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి సూచించింది.

పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్రను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దత్తత తీసుకున్న బిడ్డ వయసు మూడు నెలల కంటే తక్కువ ఉంటేనే ప్రసూతి సెలవులకు అర్హత అనే నిబంధన సరికాదని, దీనికి అనుమతించే సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌ 2020లోని సెక్షన్‌ 60(4) రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

చిన్నారి వయసుతో సంబంధం లేకుండా దత్తత తీసుకున్న సమయం నుంచి 12 వారాల పాటు ప్రసూతి సెలవులు తీసుకునేందుకు అర్హత ఉంటుందని తెలిపింది.  దత్తత తీసుకున్న బిడ్డకు కన్న బిడ్డకు మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, ప్రసూతి సంరక్షణ కనీస హక్కు అని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

నండూరి హంసనందిని అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలోనే సామాజిక భద్రత చర్యగా పితృత్వ సెలవులను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూచించింది.