భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏడుగురు విదేశీయులను అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు కాగా, ఒకరు అమెరికాకు చెందినవారు. గత వారం పలు ఎన్ఐఏ బృందాలు సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ అరెస్టులు జరిగాయి.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్ 18తో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఈ అరెస్టులు జరిగాయి. ఈ కేసులో శుక్రవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమెరికా జాతీయుడిని కోల్‌కతా విమానాశ్రయంలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అదుపులోకి తీసుకోగా, ముగ్గురు చొప్పున ఉక్రెయిన్ జాతీయులను లక్నో, ఢిల్లీ విమానాశ్రయాల్లో అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు చెల్లుబాటు అయ్యే వీసాలతో భారతదేశంలోకి ప్రవేశించినప్పటికీ, తప్పనిసరి అయిన నిషేధిత ప్రాంత అనుమతి లేకుండా మిజోరాంకు వెళ్లారని తెలుస్తున్నది. “అక్కడి నుంచి వారు మయన్మార్‌లోకి ప్రవేశించారు. అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న జాతి సమూహాలను కలిసినట్లు సమాచారం. ఐరోపా నుంచి వచ్చిన పలు డ్రోన్ల సరుకులను కూడా వారు మిజోరాంలో పంపిణీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది,” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అనుమానితులను ఢిల్లీకి తీసుకువచ్చి శనివారం డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఆయన వారికి మూడు రోజుల కస్టడీ విధించారు. అనుమానితులకు సోమవారం మరో 11 రోజుల పొడిగింపుతో మార్చి 27 వరకు రిమాండ్ విధించారు. ఈ బృందం ఉగ్రదాడులకు కుట్ర పన్నుతోందని, వారి కదలికలు సరిహద్దు ముప్పులపై ఆందోళన రేకెత్తించాయని ఎన్ఐఏ ఆరోపించింది.
“సాక్ష్యాధారాల సేకరణ, నేరపూరిత కుట్రను వెలికితీయడం, సహ నిందితులను గుర్తించడం, నిందితుల మొబైల్ డేటాను విశ్లేషించడం వంటి అంశాల దృష్ట్యా, నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించడం సమర్థనీయం” అని పాటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ తన ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఎన్ఐఏ ప్రకారం, నిందితులు “జాతి సాయుధ బృందాల” ఉపయోగం కోసం “యూరప్ నుండి భారతదేశం మీదుగా మయన్మార్‌కు భారీ పరిమాణంలో డ్రోన్లను అక్రమంగా దిగుమతి చేసుకోవడంలో” పాలుపంచుకున్నారు. ఈ బృందాలు కొన్ని నిషేధిత “భారత తిరుగుబాటు బృందాలకు ఆయుధాలు, ఇతర ఉగ్రవాద సామగ్రిని సరఫరా చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా మద్దతు ఇస్తున్నాయని” కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఎస్పీపీ రాహుల్ త్యాగి, పీపీ అనిల్ దబాస్, న్యాయవాదులు జతిన్, అమిత్ రోహిల్లాలు ప్రాతినిధ్యం వహించిన ఎన్ఐఏ, “నిందితులు, వారి సహచరులు పన్నిన ఈ కేసు మొత్తం కుట్రను వెలికితీయడానికి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు” నిందితులను రిమాండ్‌కు అప్పగించాలని కోరింది.

More Stories
ఢిల్లీలో పాకిస్థాన్ లింక్డ్ గూఢచర్య ముఠా గుట్టురట్టు
ఒడిశాలో 11 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది నక్సల్స్ లొంగుబాటు
మిస్సింగ్ కేసులు పెరగటంపై ఎన్హెచ్ఆర్సి ఆందోళన