ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ ఎండీ లేకపోవడంతో ఈడీ వెంకన్నకు నోటీసు పత్రాన్ని అందించారు. అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. 45 రోజుల్లోగా తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆలోగా ఏక్షణమైనా సమ్మెకు వెళ్తామని ఆ నోటీస్‌లో హెచ్చరించారు.
2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే రూ.350 కోట్లలో ఎటువంటి కోతలు, షరతులు లేకుండా సక్రమంగా విడుదల చేయాలని పేర్కొన్నారు. పెండింగ్ ఉన్న రూ.2,500 కోట్ల పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే జరపాలని యాజమాన్యానికి కోరారు. ఆర్టీసీ సమ్మె తేదీపై 14 రోజుల తర్వాత నిర్ణయం ఉంటుందని జేఏసీ నేతలు చెప్పారు. నోటీసులు ఇచ్చేందుకు ముందు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్‌లోని బస్‌భవన్ వద్దకు చేరుకుని శాంతియుత నిరసనకు దిగారు. ఈవీ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని ధర్నా చేశారు.
ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని, అన్యాయంగా యూనియన్లను సర్కారు రోడ్డెక్కించిందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేతలు తేల్చిచెప్పారు. గవర్నర్ వద్ద ఉన్న ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదముద్ర ఎందుకు వేయించడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లు తమకిచ్చిన హామీల కోసం ఎదురు చూశామని ఇక తమకు ఓపిక నశించిపోయిందని కార్మిక సంఘాల జేఏసీ వ్యాఖ్యానించింది. తాము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని సభలు పెట్టినా ఈ ప్రభుత్వం చర్చలకు కూడా పిలువలేదని, అసలు రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా? అని ఆర్టీసీ జేఏసీ ప్రశ్నించింది. గత ప్రభుత్వం చేయాల్సిన క్రతువు చేసిందని ఈ ప్రభుత్వం మిగిలింది ఎందుకు చేయలేదని ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఇప్పుడు ఏం చెబుతారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతున్నని, చాపకింద నీరులా ప్రైవేటీకరణకు దారి తీస్తున్నదని ఆరోపించారు.

More Stories
హైదరాబాద్ నుంచి రెగ్యులర్ రైళ్లుగా 3 సర్వీసులు
230 మందికి మాజీ మావోయిస్టులకు ఎన్ఐఏ నోటీసులు
తరుణ్ కటిక్ హత్యను ఖండిస్తూ క్యాండిల్ మార్చ్