పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా బ్లాక్’ పార్లమెంటులో నోటీసు సమర్పించింది. సిఇసిని తొలగించాలంటూ పార్లమెంటులో నోటీసు సమర్పించడం ఇదే మొదటిసారి. 130మంది లోక్‌సభ ఎంపిలు, 63మంది రాజ్యసభ ఎంపిలు ఈ నోటీసుపై సంతకం చేశారు.
ఇండియా కూటమిలో ఆప్ లేనప్పటికీ ఈ బిల్లుపై ఆ పార్టీ ఎంపిలు సైతం సంతకం చేశారు. స్వతంత్ర ఎంపిలు కూడా సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులో సిఇసిపై ఏడు అభియోగాలు పేర్కొన్నారు. ‘విధుల్లో పక్షపాత, వివక్షతతో కూడిన ప్రవర్తన’, ‘ఎన్నికల్లో మోసంపై దర్యాప్తును ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోవడం’, ‘సామూహికంగా ఓటు హక్కును కోల్పోవడం’ వంటివి నమోదు చేశారు.
పాలక బిజెపికి సిఇసి అనేక సందర్భాల్లో సహాయం చేశారని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్పై మండిపడ్డాయి. ఇది కేంద్రంలోని అధికార పార్టీకి సహాయం చేయడమే లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి అనుసరించే ప్రక్రియ ఉంటుంది. ముందు పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో సీఈసీ తొలగింపు తీర్మాన నోటీసులు ఇవ్వాలి. అందుకోసం లోక్‌సభలో నోటీసు ఇవ్వడానికి కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో ఇచ్చేందుకు 50 మంది సభ్యులు సంతకం చేయాలి.
ఆమోదం పొందాలంటే ఆయా సభల్లోని మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది, హాజరై ఓటు వేసిన వారిలో కనీసం 2/3 వంతు మంది మద్దతు ఇవ్వాలి. ఉభయ సభల్లోనూ ఒకేరోజు నోటీసు ఇచ్చి, వాటిని సభల్లో అనుమతించేవరకు ఎలాంటి కమిటీ ఏర్పాటు కాదు.

More Stories
ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు ప్రారంభం
తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్