పశ్చిమాసియా ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. దీనితో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు నేరుగా ఇరాన్‌పై దాడి చేసినప్పటి నుంచి నేటి వరకు పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.31 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మరీ దారుణం ఏమిటంటే, సోమవారం ఒక్కరోజే ఏకంగా రూ.12 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. అందుకే పెరుగుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఉపసంహరణ, ఆర్థిక నష్టాల భయంతో మార్కెట్ సూచీలు తీవ్రంగా పతమనమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజే (మధ్యాహ్నం నాటికి) మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు రూ.12.78 లక్షల కోట్లు హరించుకుపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2,299 పాయింట్లు (2.91) శాతం మేర నష్టపోయి 76,619 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 714 పాయింట్లు (2.92 శాతం) క్షీణించి 23,736 వద్ద కొనసాగుతోంది. గడచిన ఏడాది కాలంలో దలాల్ స్ట్రీట్ చూసిన అత్యంత దారుణమైన నష్టాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం మార్కెట్ అస్థిరతకు ప్రధాన కారణంగా నిలిచిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో, ఆయిల్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనితో బ్రెంట్ క్రూడ్ ఆయిన్ కేవలం వారం రోజుల్లో 25 శాతానికి పైగా పెరిగింది. దీనితో బ్యారెల్ ముడి చమురు ధర 114 డాలర్లు దాటింది. భారత్ తన అవసరాల కోసం దాదాపు 85 శాతం మేర ముడి చమురు దిగుమతులు చేసుకుంటోంది.
అందుకే చమురు ధరలు మరింత పెరిగితే ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ డిఫిసిట్, ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయనే ఆందోళన దేశ ఆర్థిక వ్యవస్తను కలవరపెడుతోంది. అందుకే దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌డీఐ) భారీగా తమ ఈక్విటీలను అమ్మేస్తున్నారు.
ముఖ్యంగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సుమారు రూ.21వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంటే ఫిబ్రవరిలో నమోదైన 17 నెలల గరిష్ఠ పెట్టుబడుల(రూ.22,615 కోట్లు)ను దాదాపు వెనక్కు తీసుకున్నారు. వాస్తవానికి ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయ ఆయిల్ కంపెనీలు ఆయిల్ ధరలు పెంచలేదు.
దీనితో మార్కెటింగ్ మార్జిన్లు తగ్గిపోతాయనే భయంతో పెట్టుబడిదారులు ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ షేర్లను వదిలించుకుంటున్నారు. దీనితో ఈ సంస్థలు 8 శాతానికి పైగా నష్టపోయాయి. విమాన ఇంధన ధరల పెరుగుదల వల్ల లాభాలు తగ్గుతాయనే భయంతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) షేర్లు 7 శాతానికి పైగా పడిపోయాయి.

More Stories
కేజ్రీవాల్ కేసులో సీబీఐ పనితీరుపై వాఖ్యలపై హైకోర్టు స్టే
పశ్చిమాసియాలో పరిణామాలు ఆందోళనకరం
ఇరాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్ కు ట్రంప్ సమాలోచనలు