కీల‌క‌మైన‌ అమెరికా రేడార్‌ను పేల్చేసిన ఇరాన్‌

కీల‌క‌మైన‌ అమెరికా రేడార్‌ను పేల్చేసిన ఇరాన్‌

అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాల‌కు ధీటుగా ఇరాన్ బ‌దులిస్తున్న‌ది. గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావ‌రాల‌పై విరుచుకుప‌డుతున్న‌ది. అయితే యుద్ధం మొద‌లైన తొలి రోజుల్లోనే అమెరికాకు చెందిన కీల‌క రేడార్‌ను ఇరాన్ పేల్చివేసింది. జోర్డాన్‌లోని మువాఫ‌క్ స‌ల్టీ ఎయిర్‌బేస్ వ‌ద్ద ఉన్న ఏఎన్-టీపీవై-2 రేడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసిన‌ట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా నిర్ధారించారు. 

ఏఎన్‌-టీపీవై-2 రేడార్‌ను థాడ్ క్షిప‌ణి బ్యాట‌రీగా వాడుతారు. శ‌త్ర దేశ క్షిప‌ణులు, డ్రోన్ల రాక‌ల‌ను ఈ రేడార్ ప‌సిక‌ట్టి మిస్సైల్ వ్య‌వ‌స్థ‌కు స‌మాచారం ఇస్తుంది. అయితే జోర్డాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో ఉన్న అమెరికా మిస్సైల్ ఇంట‌ర్‌సెప్టార్ రేడార్ కేంద్రాల‌ను ఇరాన్ ధ్వంసం చేసిన‌ట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా అంచ‌నా వేస్తున్నారు. 

సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ వ‌ద్ద ఉన్న రేడార్ వ్య‌వ‌స్త‌ను ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు యూఏఈలోని స‌ద‌ర్‌, రువాయిస్‌లో ఉన్న అమెరికా రేడార్లు కూడా ధ్వంస‌మైన‌ట్లు శాటిలైట్ పిక్స్ ద్వారా భావిస్తున్నారు. టార్గెట్ దిశ‌గా వ‌స్తున్న బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను రేడార్లు ప‌సిక‌ట్ట‌డం వ‌ల్లే యాంటీ మిస్సైల్ వ్య‌వ‌స్థ యాక్టివేట్ అవుతుంది. 

అయితే ప్ర‌స్తుతం అమెరికా వ‌ద్ద ఉన్న థాడ్ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌కు చెందిన 8 బ్యాట‌రీలు ఆప‌రేష‌న్‌లో ఉన్నాయి. రెండు యూఏఈ ద‌గ్గ‌ర‌, ఒక‌టి సౌదీ అరేబియా వ‌ద్ద ఉన్నాయి. ఇక ఇరాన్‌కు సుమారు 500 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జోర్డాన్‌లోని సాల్టి ఎయిర్‌బేస్‌లో కూడా ఓ థాడ్ బ్యాట‌రీ ఉన్న‌ది. థాడ్ రేడార్ సిస్ట‌మ్‌ను ఏఎన్‌-టీపీవై-2గా పిలుస్తారు. ఇది ట్రాన్స్‌పోర్ట‌బుల్ రేడార్‌. రేథియాన్ కంపెనీ దీన్ని ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. సుమారు 50 కోట్ల బిలియ‌న్ల ఖ‌రీదైన రేడార్ వ్య‌వ‌స్థ అమెరికా వ‌ద్ద ఉన్న‌ట్లు తెలుస్తోంది.