యుద్ధనౌకను ముంచేయడంపై ఇరాన్‌ ప్రతీకారం

యుద్ధనౌకను ముంచేయడంపై ఇరాన్‌ ప్రతీకారం

శ్రీలంక తీరంలో హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధనౌక ఐరిస్ దేనాను అమెరికా జలాంతర్గామి ముంచేయడంపై ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకున్నది. అమెరికాకు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ షిప్‌పై దాడి చేసింది.  గురువారం ఉత్తర పర్షియన్ గల్ఫ్‌లో ఒక అమెరికన్ ట్యాంకర్‌పై క్షిపణులతో దాడి చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. 

ఇరాన్‌ దాడి వల్ల అమెరికా ఆయిల్‌ ట్యాంకర్‌లో మంటలు వ్యాపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఇరాన్‌కు చెందిన ఐఆర్‌ఐఎస్‌ దేనా వార్‌షిప్‌ భారత్‌లో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్నది. ఆ తర్వాత ఇరాన్‌కు అది బయలుదేరింది. మంగళవారం రాత్రి శ్రీలంక తీరం సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఆ ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్‌ దాడి చేసింది. 

టార్పెడ్‌తో ఎటాక్‌ చేయడంతో ఇరాన్‌ యుద్ధనౌక దేనా రెండు ముక్కలై సముద్రంలో మునిగిపోయింది. మరోవైపు అందులో ఉన్న 130 మందికిపైగా సిబ్బందిలో 87 మంది నావికులు మరణించారు. గాయపడిన కొంతమందిని శ్రీలంక నేవీ కాపాడింది. సుమారు 36 మంది ఇరాన్‌ నావికులు ప్రస్తుతం శ్రీలంకలో చికిత్స పొందుతున్నారు.

అయితే అమెరికా పాల్పడిన ఈ చర్యకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర‌గాచీ హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా “దారుణ చర్య”కు పాల్పడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి పేర్కొంటూ అందుకు ‘అమెరికా తీవ్రంగా విచారిస్తుంది’  అని స్పష్టం చేశారు.

కాగా, 100 మంది సిబ్బందితో కూడిన ఇరాన్ నౌక తమ దేశ జలాలకు దగ్గర్లోనే ఉందని  శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా ప్రకటించారు. ఈ నౌకను కూడా ముంచేస్తారేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నౌకలోని సిబ్బందిని రక్షించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.  మరోవైపు ఈ నౌకకు సాయం చేయాల్సిందిగా శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమారను ఇరాన్ ప్రభుత్వం కోరింది.

ఇలా ఉండగా, గురువారం నాడు, ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా అమెరికా జలాంతర్గామి టార్పెడో ఢీకొట్టడంతో, ఆపద సమయంలో వచ్చిన సమాచారం మేరకు స్పందిస్తూ ఐఎన్ఎస్ తరంగిణిని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం మోహరించినట్లు భారత నావికాదళం తెలిపింది.  ఐఎన్ఎస్ ఇక్షక్ కూడా తరువాత మోహరించబడిందని, నౌక ధ్వంసమైన సిబ్బంది కోసం మానవతా చర్యగా తప్పిపోయిన సిబ్బంది కోసం వెతకడానికి ఇది ఆ ప్రాంతంలోనే ఉందని భారత నావికాదళం తెలిపింది. శ్రీలంక నావికాదళంతో కలిసి శోధన, రెస్క్యూ ప్రయత్నాల కోసం సమన్వయం చేసుకుంటున్నట్లు భారత నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది.