ప్రత్యక్ష సైనిక ఘర్షణలో వరుసగా ఆరవ రోజు ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఉద్రిక్తత తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఐదు రోజుల్లో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 1200కు దాటింది. లెబనాన్‌లో దాదాపు 60 మంది, ఇజ్రాయెల్‌లో దాదాపు డజను మంది మరణించారు. ఆరుగురు అమెరికన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక ప్రధాన కేంద్రంపై 100 విమానాలు, 250 బాంబులతో దాడులకు పాల్పడి 300 పైగా రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ చెబుతున్నది. ఇరాన్లో ఇంటర్నెట్ నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ ఇరాన్ లక్ష్యాలపై కొత్త దాడులు చేసింది. బీరుట్, చుట్టుపక్కల లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థానాలపై వైమానిక దాడులను పునరుద్ధరించింది.
పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. యుద్ధంపై ఇప్పటికే భారత్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. పోరాటాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
యూఏఈ ఉప-ప్రధాని అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సహా గల్ఫ్‌లోని ఉన్న రాజకీయ నాయకులతో ఫోన్లో తమ విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంభాషణలు జరిపారని లిన్ చెప్పారు. జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఇస్తుందని, దౌత్యం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మద్దతు ఇస్తుందని వాంగ్ యీ పేర్కొన్నారు.
ఖతార్ రాజధాని దోహా నగరం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఖతార్ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకోవడంతో భారీ శబ్దాలు వినిపించాయి. మరోవైపు, అజర్‌బైజాన్‌లోని నఖ్చివన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఒక డ్రోన్ నఖ్చివన్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ఢీకొట్టినట్లు అజర్బైజాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖవెల్లడించింది.
ఇరాన్ దాడులపై అజర్బైజాన్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన ఈ దాడిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇరాన్ రాయబారికి అజర్బైజాన్ సమన్లు జారీ చేసింది. రాజధాని టెహ్రాన్‌పై మరో దఫా వైమానిక దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఎక్స్‌లో పోస్టు చేసింది.ఇజ్రాయెల్, అమెరికా దాడులతో విరుచుకుపడుతుంటే ఇరాన్ కూడా అంతే ధాటిగా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సహా అనేక గల్ఫ్ దేశాలపై వందలాది డ్రోన్లు, మిసైళ్లతో తెగపడుతోంది. పశ్చిమాసియాలోని మౌలిక వసతులే లక్ష్యంగా ప్రతాపం చూపిస్తోంది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. లక్షలాది సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి సమయం పడుతుందని ఇస్లామిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధిపతి మోహసిన్ మహముది ప్రభుత్వ మీడియాకు వెల్లడించారు.
ఇరాన్ గల్ఫ్ ప్రాంతం అంతటా ఇజ్రాయెల్, యుఎస్ ప్రయోజనాలపై ప్రతిదాడులతో ప్రతిస్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఇరాక్-కుర్దిష్ రాజకీయ నాయకుడితో సంభాషణ సందర్భంగా ఇరాక్‌తో ఇరాన్ సరిహద్దులో “ఉగ్రవాద కదలికలు” ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంతలో, సముద్రంలో వివాదం మరింత పెరిగింది.
యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ అంతర్జాతీయ జలాల్లో యుఎస్ జలాంతర్గామి ఇరాన్ యుద్ధనౌకను శ్రీలంకకు సమీపంలో ముంచివేసిందని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మరో యుద్ధనౌకను ముంచేయడం ఇదే కావడం గమనార్హం. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లాపై కూడా దాడి చేయగా, ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్లను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది.
టర్కీ గగనతలంలోకి ప్రవేశించే ముందు నాటో రక్షణలు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నాయని టర్కీ తెలిపింది. ఇరాన్ దాడులు ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా రాకపోకలకు అంతరాయం కలిగించిన తర్వాత చమురు ధరలు పెరగడంతో, పెరుగుతున్న హింస ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది.
బుధవారం ప్రారంభమైనప్పుడు అమెరికా స్టాక్‌లు సాపేక్షంగా స్థిరంగా కనిపించినప్పటికీ, పెరుగుతున్న ఇంధన ఖర్చులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నెమ్మదిస్తాయనే భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. కువైట్‌లోని నీటిలో ఒక ట్యాంకర్ “పెద్ద పేలుడు”కి గురై చమురు చిందిందని బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ గురువారం తెలిపింది.
బ్రిటిష్ సైన్యం నడుపుతున్న ఈ సంస్థ కేంద్రం, కువైట్‌లోని ముబారక్ అల్-కబీర్ సమీపంలోని ఉత్తర పెర్షియన్ గల్ఫ్‌లోని కువైట్ తీరంలో ఈ దాడి జరిగిందని తెలిపింది. ముబారక్ అల్-కబీర్ సమీపంలోని ప్రాంతం నుండి పారిపోతున్న ఒక చిన్న నౌకను గుర్తించే ముందు ఓడ యొక్క మాస్టర్ పేలుడును చూశాడు.ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యా, చైనా చేసిన విజ్ఞప్తులను అమెరికా తోసిపుచ్చింది. ఈ ఘర్షణ పూర్తిగా టెహ్రాన్ అణు కార్యక్రమం, సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోందని, ఇందులో ఇతరుల ప్రమేయం అవసరం లేదని స్పష్టం చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా సుమారు 131 నగరాలు లక్ష్యంగా అమెరికా బలగాలు క్షిపణుల వర్షం కురిపించాయి.
కేవలం సైనిక స్థావరాలే కాకుండా, వ్యూహాత్మక ప్రాంతాలను కూడా ధ్వంసం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జిసి) కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, 9 యుద్ధ నౌకలను కూల్చివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు.
ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని, వారి సైనిక సామర్థ్యం నామరూపాలు లేకుండా పోయిందని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ప్రతీకార దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్‌లోని కీలక ప్రాంతాలతో పాటు, గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో టార్గెట్ చేస్తోంది.
అరబ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్‌కు వ్యతిరేకంగా రంగంలోకి వస్తుండటంతో యుద్ధం మరింత సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భద్రతా సూచనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మృతుల్లో ఎక్కువ మంది పౌరులు, మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వారసత్వ ప్రణాళికపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో, ఈ దాడులు ఆ దేశ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులు, ఇరాన్ ప్రతిదాడులను ఐక్యరాజ్యసమితి స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని విమర్శించింది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులు, ఆ దేశ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ నిజనిర్ధారణ మిషన్ దర్యాప్తు చేస్తున్నది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులతోపాటు గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ ప్రతిదాడులను ఖండించింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఇరాన్ ప్రతిదాడులు దేశ ప్రాదేశిక సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా బలప్రయోగాన్ని నిషేధించే ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధంగా ఉన్నాయని స్వతంత్ర దర్యాప్తు కమిటీ పేర్కొంది. మూడు దేశాల చర్యను ఐరాస స్వతంత్ర దర్యాప్తు అధికారులు తప్పుపట్టారు.
యుద్దానికి దూరంగా స్పెయిన్, ఫ్రాన్స్ కాగా, యుద్ధంలోకి తమ దేశాన్ని లాగవద్దని, కేవలం శాంతిని కోరుకుంటున్నందుకు తమపై ఆంక్షలు విధించడం సరికాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పెయిన్‌తో వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో, సాంచెజ్ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇరాన్‌పై యుద్ధం ప్రకటిస్తున్న వారి లక్ష్యాల్లో స్పష్టత లేదని, స్పెయిన్ ఎన్నడూ ఇలాంటి రక్తపాతాన్ని కోరుకోలేదని ఆయన పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని పలు దేశాలు చేసిన తీర్మానాల తర్వాతే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. ఒక దేశం చేసే చట్టవిరుద్ధమైన చర్యలకు మరో దేశం అదే స్థాయిలో స్పందించడం వల్ల మానవాళికి భారీ విపత్తులు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని త్వరగా తగ్గించాలని పిలుపునిచ్చారు. సిడ్నీలో జరిగిన లోవీ ఇన్స్టిట్యూట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ ప్రభుత్వ రూపాన్ని మార్చడానికి కెనడా చర్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇది పశ్చిమాసియాలో అస్థిరత, భీభత్సానికి ప్రధాన మూలాన్ని సూచిస్తుందని హెచ్చరించారు. ఈ యుద్ధం అంతర్జాతీయ క్రమ వైఫల్యానికి మరో ఉదాహరణ అని ఆయన పునరుద్ఘాటించారు.
More Stories
శక్తివంతమైన అణ్వాయుధ క్షిపణిని పరీక్షించిన అమెరికా
నేపాల్ ఎన్నికల్లో హిందూ రాచరికం పునరుద్ధరణకు డిమాండ్
మావోయిస్టు అగ్రనేత గణపతి అమిత్ షా సమక్షంలో లొంగుబాటు?