టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌

టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌

టీమిండియా రాబోయే అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బిసిసిఐ ప్రకటించింది. జూన్‌ నెలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించి ఒక టెస్టు మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుందని తెలిపింది. ప్రస్తుతం భారత్ ఐసీసీ మేన్స్ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌లో పాల్గొంటోంది.  గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన భారత్‌, సూపర్‌-8 దశలో జింబాబ్వే, వెస్టిండీస్‌ జట్లపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

సెమీ ఫైనల్లో మార్చి 5 న ఇంగ్లాండ్ జట్టుతో భారత్‌ తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే మార్చి 8న ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతుంది. టోర్నమెంట్‌ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2026 సీజన్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత జూన్‌లో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నారు.

భారత్‌ – ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌

జూన్‌ 6 -10 : టెస్టు మ్యాచ్‌ చండీఘర్ (ఉదయం 9:30);జూన్‌ 14 : మొదటి  వన్డే – ధర్మశాల; జూన్‌ 17 : రెండో వన్డే – లక్నో;  జూన్‌ 20 : మూడో వన్డే – చెన్నై  (వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి)

ఇదిలా ఉండగా భారత క్రికెట్‌ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20, టెస్టు ఫార్మాట్‌ల నుంచి తప్పుకున్నప్పటికీ వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. వీరిద్దరూ చివరిసారిగా జనవరిలో న్యూజీలాండ్ పై వన్డే సిరీస్‌లో ఆడారు. ఆ సిరీస్‌లో కోహ్లి వరుస సెంచరీలతో మెప్పించగా, రోహిత్‌ కూడా మంచి ప్రదర్శన కనబరిచారు. 

అయితే సిరీస్‌ను న్యూజిలాండ్‌ గెలుచుకుంది. ఇక జూన్‌ 14న ఆఫ్ఘనిస్తాన్‌తో మొదటి వన్డే ద్వారా కోహ్లి-రోహిత్‌ మళ్లీ టీమిండియా తరఫున ఆడనున్నారు. ఇంతకుముందు వారు  రాయల్ ఛాలంజెర్స్, బెంగళూరు; ముంబై ఇండియన్స్  తరఫున ఐపీఎల్‌లో అభిమానులను అలరించనున్నారు.