సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని పురాతన కాలం నుంచీ మన దేశంలో వినియోగిస్తున్నారని పేర్కొంటూ మధ్యవర్తిత్వం అనేది భారతదేశ డిఎన్‌ఎలోనే ఉందని, వేల ఏళ్ల నాటి చరిత్ర దీనికి ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో ఆదివారం విజయవాడలో మధ్యవర్తిత్వంపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ వేల ఏళ్ల నాటి చరిత్ర దీనికి ఉందని వివరించారు.
శ్రీకృష్ణుడు పాండవులకు, కౌరవులకు మధ్య శాంతి కోసం చేసిన ప్రయత్నాన్ని మొదటి అధికారిక మధ్యవర్తిత్వంగా ఉదహరించారు. న్యాయాన్ని అందించడంలో మధ్యవర్తిత్వం అనేది ఒక ముఖ్యమైన సాధనమని, దీన్ని కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రాధాన్యత కలిగిన పద్ధతిగా చూడాలని ఆయన సూచించారు. మధ్యవర్తిత్వాన్ని కోర్టులు కచ్చితంగా అందరికీ తెలిసేలా చేయాలని, 2023లో వచ్చిన మధ్యవర్తిత్వ చట్టం వల్ల దీనికి ఒక చట్టబద్ధత లభించిందని చెప్పారు.
దీనిద్వారా జరిగే పరిష్కారాలు కోర్టు డిక్రీతో సమానంగా అమలు చేయబడతాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియేషన్ విషయంలో ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రితో చేసిన మీడియేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఎపి ప్రభుత్వం రైతులతో జరిపిన చర్చలు ఫలితమే అమరావతి అని గుర్తు చేశారు. మీడియేషన్‌ను లీగల్, ప్రొఫెషనల్ కల్చర్‌లో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు.
అమరావతిలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు. ఇందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు.
జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథార్టీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ బెస్ట్ జ్యుడీషియల్ సిటీని నిర్మిస్తామని, వీటికి అవసరమైన భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమరావతిలోని జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
మధ్యవర్తిత్వంతో కేసు పరిష్కరిస్తే రూ.10 వేలు ఇస్తామని, కేసు పరిష్కారం కాకున్నా రూ.3 వేలు ఇస్తామని, కేసు పరిష్కారమై సత్వర న్యాయం అందితే త్వరితగతిన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అంతకు ముందు, అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద రూ. 165 కోట్ల వ్యయంతోజుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంఖుస్థాపన చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి కూడా ప్రసంగించారు.

More Stories
బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ వీడియో దుమారం
బాణసంచా తయారీలో భారీ విస్ఫోటం.. 21 మంది మృతి
తిరుమలలో ప్రయోగాత్మకంగా “శ్రీవారి ముడుపు పత్రం పథకం”