* మోదీకి ‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రమాదకరమే అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరోక్షంగా ఇజ్రాయెల్‌లో రెండేళ్ల క్రితం హమాస్ నర మేధాన్ని ఖండించారు. ఉగ్రవాదం, హింసోన్మాదంపై ఇజ్రాయెల్ జరిపే పోరులో భారతదేశం ఎప్పుడూ తోడుగా ఉంటుందని ఆయన ప్రకటించారు. తమ కూటమి బలాన్ని నొక్కి చెబుతూ, ఈ ప్రాంతానికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తూ, భారత ప్రధాని మోదీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
భారత నాయకుడు నెస్సెట్‌లో ఒక చారిత్రాత్మక ప్రసంగంలో తన దేశం యూదు రాజ్యంతో “దృఢంగా” నిలుస్తుందని చెప్పారు. “ఈ క్షణంలో, ఆ తర్వాత కూడా భారతదేశం పూర్తి నమ్మకంతో ఇజ్రాయెల్‌తో దృఢంగా నిలుస్తుంది” అని నెస్సెట్‌లో భారత ప్రధానిని సత్కరిస్తూ జరిగిన ప్రత్యేక సమావేశంలో మోదీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ఒక భారతీయ నాయకుడు ప్రసంగించడం ఇదే మొదటిసారి.
సభ్యులు ఉద్ధేశించి తొలుత హిబ్రూ బాషలో షలోమ్ అని వారికి అభివాదాలు చేశారు. సామరస్యం, సోదరభావం అభివాదాలకు సూచకంగా ఈ పదం వాడుతారు. ఇజ్రాయెల్‌కు తమ దేశ మద్దతు లాతీతంగా ఉంటుందని చెబుతూ ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ బలగాలు చొరబడి పౌరుల ప్రాణాలు తీసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి ఘటనలో మృతి చెందిన వారికి భారతదేశ ప్రజల తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. హమాస్ దాడిని అనాగరికం, అమానుషం అని పేర్కొన్నారు.
భారత్, ఇజ్రాయెల్ రెండూ ప్రాచీన విశిష్ట నాగరికతల దేశాలని, ఇది రెండు దేశాల స్నేహబంధం పూర్వ చరిత్ర అని ప్రధాని పేర్కొన్నారు. రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ తొలిరోజే బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్‌లో ఎంపిలను ఉద్ధేశించి ప్రసంగించారు. తాను ఇక్కడికి 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలను తీసుకుని వచ్చానని సభికుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. అదే విధంగా స్నేహం, ఆదరణభావం, భాగస్వామ్యం అనే మూడు కానుకలను అందించేందుకు వచ్చానని తెలిపారు.
పలు దశల్లో అనేక కష్టాలు పడ్డ యూదులకు సంఘీభావంగా ఉంటామని మోదీ తెలిపారు. ఇదే సమయంలో పాలస్తీనియా సమస్యలపై స్పందించాల్సిన సమయం కూడా వచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు. ఇక తాను పుట్టిన తేదీకి విశేషం ఉందని, ఇజ్రాయెల్‌ను భారతదేశం గుర్తించిన రోజే తాను జన్మించానని కూడా వెల్లడించారు. ఇజ్రాయెల్‌తో భారత్ సుదీర్ఘ బంధం గురించి తెలిపారు.
భారతదేశ ప్రధాని ఒక్కరు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మాట్లాడటం ఇదే తొలిసారి అయింది. ఇజ్రాయెలీ నేలతో భారతదేశ సంబంధాల పూర్వరంగం అత్యంత పురాతనం. ఇది రక్త సంబందం అని సభికుల మోదీ, మోదీ నినాదాల నడుమ చెప్పారు. నెత్తురు, త్యాగాల సమ్మిళిత అనుబంధం అని పేర్కొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలోనే దాదాపుగా 4 వేల మంది భారతీయులు , పలు కులాలకు చెందిన వారు సైనికులుగా ఇక్కడ హైఫా యుద్ధంలో నెత్తురు చిందించారు. ప్రాణాలు వదిలారని వెల్లడించారు.
ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు సంక్షిప్తంగా మాట్లాడుతూ భారతదేశం ఇజ్రాయెల్‌కు వెంట నిలిచింది. ఇజ్రాయెల్‌కు తోడుగా నిలిచిందని, సత్యం కోసం పాటుపడిందని కొనియాడారు. స్నేహితుడు మోదీకి ధన్యవాదాలు అని నెతన్యాహు తెలిపారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఘటనను భారతదేశం ఖండించిన విషయం ప్రస్తావించారు.
ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఇజ్రాయెల్ ప్రతిపక్షం కూడా శ్రద్ధగా ఆలకించింది. అంతకు ముందు పార్లమెంట్ నుంచి వాకౌట్ జరిపిన ప్రతిపక్ష ఎంపిలు ప్రధాని మోదీ ప్రసంగం దశలో లోపలికి వెళ్లారు. పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒమానా అంతకు ముందు ప్రధాని మోదీకి ఆప్ కా స్వాగత్ హై అని పలకరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంటు అత్యున్నత ‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’ను బహూకరించింది.
భారత్-ఇజ్రాయెల్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు అసాధారణ రీతిలో కృషి చేసినందుకు దీనిని అందజేసింది. ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన కెనెసెట్‌లో మోదీ ప్రసంగం పూర్తి కాగానే స్పీకర్ అమిర్ ఒహానా ఈ పురస్కారాన్ని బహూకరించారు. దీన్ని అందుకున్న తొలి నేత మోదీయే కావడం గమనార్హం.
ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా నుంచి కూడా అత్యున్నత పతకాలు అందుకున్న అరుదైన ప్రపంచనేత మోదీయే కావడం విశేషం. ఆయన 2018లో పాలస్తీనా నుంచి ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ పురస్కారాన్ని స్వీకరించారు.

More Stories
గ్రహ సరిహద్దులు దాటుతున్న వాతావరణ సంక్షోభం
రాష్ట్రపతి భవన్లో కొత్త విగ్రహం… సి. రాజగోపాలాచారి
నిరసన ప్రదర్శనలతో కేరళ ఆరోగ్యమంత్రికి గాయాలు