బీఎస్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్ విలాసవంత యాత్రపై కేంద్రం కన్నెర్ర

బీఎస్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్ విలాసవంత యాత్రపై కేంద్రం కన్నెర్ర

బీఎస్‌ఎస్‌ఎల్‌ అధికారి ఒకరు కుటుంబ సమేతంగా విలాసవంత పర్యటన జరిపేందుకు  పర్యటన కోసం 50 మంది అధికారులను కేటాయించారు. పలు వాహనాలు, బాత్ కిట్లు, షేవింగ్‌ కిట్లు, టవల్స్‌తో పాటు లోదుస్తులు వంటివి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది వైరల్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆయనకు షో కాజ్‌ నోటీస్‌ జారీ చేసింది.

1987 బ్యాచ్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ అధికారి, బీఎస్‌ఎన్‌ఎల్‌లో డైరెక్టర్ వివేక్ బంజాల్  ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక పర్యటన చేయాలని నిర్ణయించారు. ప్రయాగ్‌రాజ్‌ పర్యటన కోసం విస్తృత, విలాసవంతమైన ఏర్పాట్లు చేయాలంటూ ఫిబ్రవరి 19న ఆదేశాలు జారీ అయ్యాయి.  అందులో పాయింట్‌ టు పాయింట్‌ పోట్రోకాల్‌ పాటించాలని పేర్కొన్నారు.

50 మందికి పైగా బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు, సిబ్బందికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగించారు. ఆ అధికారి ప్రయాణం, ఆతిథ్య ఏర్పాట్లు, స్నానాల వద్ద సౌకర్యాలు, ఆలయాల సందర్శన సమయంలో సమన్వయం గురించి ప్రస్తావించారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పురుషులు, మహిళల స్నాన్నాల కోసం 8 బాత్‌ కిట్లు, షేవింగ్‌ సెట్లు, టవల్స్‌, లోదుస్తులు, హెయిర్‌ ఆయిల్‌, దువ్వెనలు, పేస్ట్‌లు, బ్రష్‌లు వంటి వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, వాటర్‌ బాటిల్స్‌, స్నాక్స్‌, రిఫ్రెష్‌మెంట్‌లు, భోజనాలు, ఫొటోగ్రఫీ, ఎస్కార్ట్ సేవలు వంటి ఇతర సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు ఆదేశాలు అందాయి.

అయితే ఈ ఆర్డర్‌ కాపీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒకవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌ అప్పుల్లో కూరుకుపోగా ఆ సంస్థ డైరెక్టర్‌ విలాసవంత పర్యటనకు  విస్తృత ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ పర్యటనను వివేక్ బంజాల్ రద్దు చేసుకున్నారు. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఆమోదయోగ్యం కాదని స్పాష్టం చేశారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షో కాజ్‌ నోటీస్‌ జారీ చేసినట్లు చెప్పారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.