మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి నేపాల్‌లో తలదాచుకుంటున్నట్లు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వయో భారం, అనారోగ్య కారణాలతో అక్కడ తలదాచుకుంటున్న గణపతిని భారత్‌కు తీసుకుని రావడానికి అక్కడి ప్రభుత్వంతో కేంద్ర హోం శాఖ రాయబారం నడుపుతున్నట్లు కూడా సమాచారం.
మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి, బడే దామోద ర్, నూనె నర్సింహరెడ్డిలు డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన సందర్భంగా, గణపతి నేపాల్‌తో తలదాచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన వెల్లడించడంతో ఈ వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ నేపథ్యంలో తమ ముందు త్వరలో మావోయిస్టు పార్టీ ముఖ్యులు లొంగిపోనున్నట్లు డిజిపి చెప్పడంతో ఆ లొంగిపోయే అగ్రనేత గణపతేనా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇలా ఉండగా మావోయిస్టు పార్టీలో ఇంకా కొనసాగుతున్న వారిలో తెలంగాణకు చెందిన 11మంది ఉన్నట్లు డిజిపి శివధర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. వీరిలో పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. వారిలో గద్వాల్‌కు చెందిన జోడి రత్నాబాయ్ అలియాస్ సుజాత(గణపతి భార్య) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా కొనసాతున్నారు. అలాగే హన్మకొండకు చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ ప్రస్తుతం జార్ఖండ్‌లో మావోయిస్టు పార్టీ టెక్నికల్ డిపార్ట్ మెంట్ ఇన్‌చార్జీగా ఉన్నారు.
ఖాజీపేటకు చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్. సికింద్రాబాద్‌కు చెందిన వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, కమ్యూనికేషన్ విభాగానికి ఇంచార్జ్‌గా, , హైదరాబాద్‌కు చెందిన నక్క సుశీల అలియాస్ రేలా డివిజన్ కమిటీ సభ్యురాలిగా, మక్తల్‌కు చెందిన అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ పార్టీ సభ్యుడిగా, దేవ్‌జీ బృందంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా, ధర్మారంకు చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపి ఏరియా కమిటీ సభ్యురాలిగా, కాశిపోగు భవాని అలియాస్ సుగుణ దేవ్‌జీ బృందంలో ఏరియా కమిటీ సభ్యురాలిగా, వెంకటాపురంకు చెందిన కుజం ఇడమల్ ఇల్లందు, నర్సంపేట కమాండర్‌గా పనిచేస్తున్నారు.
ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న నేపథ్యంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో బలహీన పడిన పార్టీ బాధ్యతలను హిడ్మాకు అప్పగించగా, ఆయన కూడా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తరువాత పార్టీ బాధ్యతలను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటి వరకు దేవ్‌జీనే పార్టీ నడిపించినట్లు పోలీసు నిఘా వర్గాలకు సమాచారం ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా దేవ్‌జీ లొంగిపోవడం ఆయనతో పాటు పార్టీలో కీలక నేతలుగా ఉన్న మల్ల రాజిరెడ్డి, బడే దామోదర్ కూడా లొంగిపోవడంతో ఇక మిగిలిన వారు పార్టీని నడిపిస్తారా, లేదా వారు కూడా పోలీసులకు లొంగిపోతారా అనేది తేలాల్సి ఉంది.

More Stories
నేడు దేశవ్యాప్తంగా బిఎంఎస్ “నిరసన దినం”
భారత్ తో షడ్భుజ కూటమి ప్రతిపాదించిన ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్, భారత్ మైత్రి.. భవిష్యత్తు కోసం భరోసా