* అడవులు వీడిన దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి
తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన నలుగురు సీనియర్ నాయకులు జనజీవనంలోకి వచ్చారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో అగ్రనేత దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డిలు ఉన్నారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. తిప్పిరి తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి. లొంగిపోయిన నలుగురు మావోయిస్టులకు డీజీపీ రివార్డు చెక్కులను అందించారు.
వీరిలో పొలిట్ బ్యూరో సభ్యుడు (పీబీఎం) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (సీసీఎం) మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం) నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రన్నా దాదా ఉన్నారు.
మహారాష్ట్ర దండకారణ్యంలో దేవ్జీ అజ్ఞాత జీవితం గడిపారని డీజీపీ పేర్కొన్నారు. తిరుపతి గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా దేవ్జీ పనిచేశాడని 2001లో సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందినట్లు తెలిపారు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యి 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పూర్తి ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వివరించారు. మల్లోజుల వేణుగోపాల్ బయటకు వచ్చాక మావోయిస్టు అధికార ప్రతినిధిగా దేవ్జీ వ్యవహరించారని, పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలిటరీ ఇన్ఛార్జ్గా దేవ్జీ వ్యవహరిస్తున్నారని డీజీపీ వెల్లడించారు.
మల్లా రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారని ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రపల్లి గ్రామమని తెలిపారు. మల్లా రాజిరెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యమన్న డీజీపీ 1975లో పెళ్లి తర్వాత భార్య రత్నమ్మతో అజ్ఞాతంలోకి వెళ్లారబం ఛత్తీస్గఢ్లో 1998లో జరిగిన ఎన్కౌంటర్లో రత్నమ్మ చనిపోయారని పెక్రోన్నారు. 1988లో ఆదిలాబాద్ జైలు నుంచి మల్లా రాజిరెడ్డి తప్పించుకున్నారని అక్కడ మంగీ సారథ్యంలో ఈయన పనిచేసినట్లు డీజీపీ తెలిపారు.
40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో పనిచేసిన ఈ అగ్రనేతలు లొంగుబాటు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీని పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నలుగురి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో అగ్రస్థాయి బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు కీలక నేతలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన ఇంకా 11 మంది అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. వారు కూడా త్వరలో జనజీవనంలోకి రావాలని డీజీపీ కోరారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి అడవుల్లో లేరని, బయట ఎక్కడో షెల్టర్ తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు.
“మేం ప్రజల సమస్యలపై వారి తరఫున కలిసి పనిచేస్తాం. పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్లాలనేది మా ఉద్దేశం కాదు. ప్రజల సమస్యలపై జరిగే పోరాటాలను సంఘటితం చేయడం కోసం చట్ట పరిధిలో పనిచేయాలని లోతుగా ఆలోచించాం. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజల పోరాటాలకు మద్దతుగా నిలబడతామని హామీ ఇస్తున్నాం. మావోయిజం మాత్రం ఎప్పటికీ ముగిసిపోదు. ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది” అని రాజిరెడ్డి తెలిపారు.
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల పునరావాస పథకం ప్రకారం, వీరికి లభించే మొత్తం రూ. 90 లక్షల నగదు బహుమతిని చెక్కుల రూపంలో చెల్లిస్తారు. అలాగే తెలంగాణ పోలీసు శాఖ, తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం కింద వీరికి లభించాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందిస్తామని డీజీపీ తెలిపారు.
More Stories
మల్లన్న జాతరలో దాడికి గురైన రజకుల పరామర్శ
కేరళమ్గా మారనున్న కేరళ
ఏఐ సమ్మిట్ లో నిరసనపై యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్