భారతదేశం- అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి సోమవారం వాషింగ్టన్‌లో ప్రారంభం కావాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఒప్పందంలో భాగంగా జరగాల్సిన ప్రధాన సంధానకర్తల కీలకమైన సమావేశం సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, తరువాత ప్రకటించిన కొత్త పన్ను విధానాలు అనిశ్చితిని పెంచాయి. దీంతో సమావేశం వాయిదా పడింది.
దర్పన్ జైన్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, అతని బృందం సమావేశం కావాల్సి ఉంది. ఫిబ్రవరి 20న, ట్రంప్ పరిపాలన విధించిన దిగుమతి పన్నులు రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని తర్వాత, ఫిబ్రవరి 24 నుండి అన్ని దేశాలపై కొత్తగా 10% పన్ను విధిస్తామని ట్రంప్ ప్రకటించాడు. మరుసటి రోజు దానిని 15%కి పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఈ కొత్త పరిస్థితులు ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో అస్పష్టంగా ఉంది. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై విస్తృత సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, భారతదేశంతో వాణిజ్య ఒప్పందంలో మార్పు ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం భారతదేశం నుండి వచ్చే వస్తువులపై విధించిన 18 శాతం సుంకం కొనసాగుతుందని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

More Stories
సుంకాలు 15 శాతానికి పెంచేసిన ట్రంప్
మూడు భారీ ఇరాన్ చమురు నౌకలను పట్టుకున్న భారత్
ట్రంప్ విచ్చల విడిగా విధించిన టారీఫ్‌ల కొట్టివేత