డ్వాక్రా గ్రూపులకిచ్చే రుణాలు దేశం కోసం సురక్షితమైన పెట్టుబడి

డ్వాక్రా గ్రూపులకిచ్చే రుణాలు దేశం కోసం సురక్షితమైన పెట్టుబడి
స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందించడం నష్టంకాదని, దేశానికి అత్యంత సురక్షితమైన పెట్టుబడుల్లో ఒకటని  భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ ఆర్థిక అక్షరాస్యత-సమర్థత సదస్సుకు అధ్యక్షత వహిస్తూ  కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. 
 

మహిళల నేతృత్వంలోని సంస్థల పరివర్తన సామర్థ్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వాటాదారులందరి సమష్టి మద్దతుతో, “దీదీలు” లఖ్‌పతి దీదీల నుంచి కోటీశ్వరులుగా పురోగమించగలరని తెలిపారు. తద్వారా మహిళల నేతృత్వంలోని గ్రామీణ పరివర్తన వేగవంతమై, వికసిత్ భారత్ దార్శనికతకు గణనీయ తోడ్పాటు లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

గ్రామీణ కుటుంబాలన్నింటికీ ఆర్థిక వనరుల లభ్యతను బలోపేతం చేయడం, వ్యాపారాలకు ఆర్థిక సహాయాన్ని విస్తరించడం, నష్టం నుంచి రక్షించే విధానాలను మెరుగుపరచడం వంటి అవసరాలను కేంద్ర మంత్రి చెప్పారు.  సదస్సులో ఆర్థిక అవగాహనను బలోపేతం చేయడం, కుటుంబాల ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడం, గ్రామీణ భారత్ అంతటా సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించడం గురించి చర్చించారు. 

భారత ఆర్థిక సమ్మిళితత్వ ప్రయాణం ఇప్పుడు వ్యాపార ఆధారిత సాధికారతగా పరిణామం చెందాలని, ఆర్థిక వనరుల లభ్యత నుంచి ఉత్పాదక క్రెడిట్, వ్యాపారాలకు ప్రోత్సాహం, సుస్థిరమైన ఆర్థిక సామర్థ్యం వైపు దృష్టిని మళ్లించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి,
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీమతి డి. అనసూయ సీతక్క మాట్లాడుతూ తెలంగాణ దేశంలోనే అత్యంత తక్కువ వయస్సు గల రాష్ట్రమైనప్పటికీ, ఇది పాతకాలం నాటి రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎస్ఆర్ఎల్‌ఎమ్)ను అనుసరిస్తోందని తెలిపారు. మిషన్ ఆధారిత కార్యక్రమాలు తెలంగాణ మహిళలు తదుపరి దశ వ్యాపార ఏర్పాటుకు నాయకత్వం వహించడానికి వీలు కల్పిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
 
ఈ కార్యక్రమంలో భాగంగా మూడు ప్రధాన జాతీయ స్థాయి కార్యక్రమాలను ప్రారంభించారు: స్వయం సహాయక బృందాల సభ్యుల వ్యక్తిగత వ్యాపారాల కోసం బ్యాంక్ రుణాల వ్యవస్థ, స్వయం సహాయక బృందాల సభ్యుల కోసం యూపీఐ ఆధారిత రుణ ఎంపికలు, స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక అవగాహనను పెంపొందించే డిజిటల్ మాడ్యూల్స్.  
 
రుణాల పంపిణీని సులభతరం చేయడం, డిజిటల్ ఫైనాన్స్ అమలును ప్రోత్సహించడం, గ్రామీణ మహిళల్లో ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందించారు.