పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై సుప్రీం కోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్కు సహాయం చేయడానికి జిల్లా ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులను నియమించాలని కోల్కతా హైకోర్టును ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఈసీ, బంగాల్ ప్రభుత్వం పరస్పరం ఆరోపణలు చేసుకోవటం దురదృష్టకరమని పేర్కొంది.
బంగాల్ ప్రభుత్వం తగిన సంఖ్యలో గ్రేడ్-ఎ అధికారులను నియమించకపోవటాన్ని సీరియస్గా తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చి సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, ఈనెల 28వ తేదీ నాటికి ఓటరు జాబితా ముసాయిదాను ప్రచురించేందుకు అనుమతి ఇచ్చింది. అనుబంధ ఓటరు జాబితా తర్వాత ప్రకటించాలని సూచించింది.
ఎస్ఐఆర్లో పాల్గొనే జ్యుడీషియల్ అధికారులకు రవాణా సదుపాయంతోపాటు భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఎస్ఐఆర్ ప్రక్రియలో న్యాయ అధికారులను నియమించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ప్రశంసించింది. ఈ నిర్ణయం ప్రజలకు భారీ విజయంగా అభివర్ణించింది. ఓటరు జాబితా సవరణలో అవకతవకలు జరుగుతున్నాయన్న తమ ఆరోపణలు నిజమని కోర్టు తీర్పు నిరూపించిందని టీఎంసీ పేర్కొంది.
ఓటరు జాబితా పరిశీలకులు చట్టబద్ధమైన అభ్యర్థనలను అడ్డుకుంటూ, నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే నిష్పాక్షిక న్యాయాధికారుల ద్వారా అన్ని అభ్యంతరాలు, వివాదాల పరిష్కారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని పార్టీ స్వాగతించింది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యతను విస్మరించిందని టీఎంసీ విమర్శించింది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నది టీఎంసీ ప్రభుత్వమేనని బీజేపీ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకుంటూ, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నది మమతా బెనర్జీ ప్రభుత్వమేనని మండిపడ్డారు.
ఎన్నికల సంఘం కేవలం స్వేచ్ఛా, నిష్పక్షపాత ఓటరు జాబితా సవరణ కోసం ప్రయత్నిస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ సహకరించడం లేదని ఆయన విమర్శించారు. బోగస్ ఓటర్లను తొలగించేందుకు సవరణ అవసరమని బీజేపీ వాదిస్తుండగా, నిజమైన ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణలను టీఎంసీ కొనసాగిస్తోంది. అయితే, ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

More Stories
షర్టులు విప్పి ఏఐ సమ్మిట్లోకి దూసుకెళ్లిన యూత్ కాంగ్రెస్
పాక్స్ సిలికా కూటమిలో చేరిన భారత్
ఏడాదిలో హామీల అమలులో రేఖ గుప్తా ప్రభుత్వం ముందడుగు