అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మార్చ్ లో సంతకాలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మార్చ్ లో సంతకాలు
 
భారత్‌-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరిగే అవకాశం వుందని, ఏప్రిల్‌లో అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. అలాగే బ్రిటన్‌, ఒమన్‌లతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా ఏప్రిల్‌లోనే అమలయ్యే అవకాశం వుంది.  కాగా న్యూజీలాండ్‌తో కుదుర్చుకునే ఒప్పందం సెప్టెంబరు నుండి అమల్లోకి రావచ్చని గోయల్‌ తెలిపారు.
సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయాలని యురోపియన్‌ యూనియన్‌ కూడా కోరుకుంటోందని చెప్పారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రస్తావనాంశాలను భారత్‌, కెనడాలు ఖరారు చేస్తున్నాయని తెలిపారు.  భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశను ఖరారు చేయడానికి వచ్చే వారం వాషింగ్టన్‌లో ఇరు దేశాల ముఖ్య ప్రతినిధులు భేటీ అవుతారు.
మూడు రోజులు పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఒప్పందంపై సంతకాలు చేసేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్‌ గ్రీర్‌ మార్చిలో భారత్‌కు వచ్చే అవకాశం వుందని గోయల్‌ తెలిపారు.  టారిఫ్‌లను 18శాతానికి తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులు ఈ నెల్లో జారీ అవుతాయని భావిస్తున్నట్లు గోయల్‌ చెప్పారు. భారత్‌, అమెరికా వాణిజ్య ఒప్పందంతో భారత ఎగుమతిదారులకు అపార వాణిజ్య అవకాశాలు వస్తాయని గోయల్‌ చెప్పారు. 
రూ.25,060కోట్ల విలువైన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ (ఇపిఎం)కు చెందిన ఏడు విడిభాగాలను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు.  వ్యవసాయంతో సహా కీలకమైన సున్నిత రంగాలకు ప్రభుత్వం రక్షణ కల్పించిందన్నారు. వాస్తవానికి చాలా దూరమైన ప్రపంచంలో రాహుల్‌ జీవిస్తున్నారంటూ గోయల్‌ విమర్శించారు. ఇక్కడున్న వారందరూ ఎగుమతిదారులే, 50శాతం టారిఫ్‌లతో మీరు సంతోషంగా వుంటారా? అని ఎదురు ప్రశ్నించారు. మన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయా? ఉద్యోగాలు సురక్షితంగా వుంటాయా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.