జలాంతర్గాముల నిర్మాణంలో అమెరికాను వెనక్కు నెట్టిన చైనా

జలాంతర్గాముల నిర్మాణంలో అమెరికాను వెనక్కు నెట్టిన చైనా

జలాంతర్గాముల నిర్మాణాన్ని చైనా గణనీయంగా పెంచిందని అమెరికా పరిశోధన సంస్థ ఐఐఎస్‌ఎస్‌ పేర్కొంది. తద్వారా సముద్ర జలాల్లో అమెరికాకు సవాళ్లు విసురుతోందని వెల్లడించింది. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ సముద్ర జలాలపై యూఎస్‌ అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఆ ఆధిపత్యానికి చైనా సవాల్‌ విసురుతోంది. అణుశక్తి జలాంతర్గాముల తయారీలో ఆ దేశ అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ వ్యూహాత్మకంగా దూసుకుపోవడమే ఇందుకు కారణం.

గత ఐదేండ్లుగా ప్రపంచంలో అమెరికా సహా ఏ దేశానికి సాధ్యం కానీ స్థాయిలో చైనా సబ్‌మెరైన్లను తయారు చేస్తోంది.  చైనా తన న్యూక్లియర్‌ సబ్‌మెరైన్ల తయారీని భారీగా పెంచిందని, ప్రస్తుతం అమెరికా కంటే వేగంగా వీటిని సముద్రంలోకి ప్రవేశపెడుతోందని అమెరికాకు చెందిన అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయన సంస్థ (ఐఐఎస్‌ఎస్‌) నివేదిక పేర్కొంది.  ఈ మేరకు ‘మిలిటరీ బ్యాలెన్స్‌ 2025’ పేరుతో నివేదికను విడుదల చేసింది.

2021 నుంచి 2025 మధ్య కాలంలో జలాంతర్గాముల నిర్మాణంలో చైనా తన ఆధిపత్యాన్ని చూపించినట్టు నివేదిక తెలిపింది.  ఈ ఐదేండ్లలో చైనా 10 అణు జలాంతర్గాములను తయారు చేయగా, అమెరికా కేవలం 7 మాత్రమే నిర్మించినట్టు వెల్లడించింది. అంతేకాక, చైనా 79,000 టన్నుల సామర్థ్యంతో బోట్లను తయారు చేయగా, అమెరికా 55,500 టన్నులకే పరిమితమైనట్టు యూఎస్‌ సంస్థ పేర్కొంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2016- 2020 మధ్య కాలంలో చైనా కేవలం 3 సబ్‌మెరైన్లను మాత్రమే నిర్మించింది. 

కానీ ఇప్పుడు ఆ వేగాన్ని ఏకంగా మూడు రెట్లు పెంచి అమెరికాకు షాకిచ్చింది. 2025 ప్రారంభం నాటికి, చైనా వద్ద 12 క్రియాశీల అణుశక్తి జలాంతర్గాములు ఉన్నాయని నివేదిక పేర్కొంది. వీటిలో ఆరు బాలిస్టిక్‌-మిస్సైల్‌ (క్షిపణి) బోట్లు కాగా, మిగిలిన ఆరు గైడెడ్‌- మిస్సైల్స్‌. అమెరికా విషయానికి వస్తే, ఆ దేశం వద్ద మొత్తం 65 జలాంతర్గాములు ఉన్నాయి. అందులో 14 బాలిస్టిక్‌-మిస్సైల్‌ బోట్లు ఉన్నాయి. 

అదేవిధంగా చైనా వద్ద 46 బోట్లతో కూడిన భారీ ‘సంప్రదాయ ఇంధనంతో నడిచే’ జలాంతర్గామి దళం కూడా ఉందని ఐఐఎస్‌ఎస్‌ ‘మిలిటరీ బ్యాలెన్స్‌’ నివేదిక పేర్కొంది. అయితే అమెరికా వద్ద ఒక్క సంప్రదాయ శక్తితో నడిచే జలాంతర్గామి కూడా లేదని నివేదిక తెలిపింది. న్యూక్లియర్‌ సబ్‌మెరైన్ల తయారీ కోసం చైనా తన ఉత్తర ప్రాంతంలోని ‘హులుడావో’ యార్డును భారీగా విస్తరించింది. 2019-2023 మధ్య కాలంలో చైనాలోని ప్రధాన నాలుగు షిప్‌యార్డుల్లో 39 యుద్ధ నౌకలను తయారు చేసింది. ఇందులో 2025లో అందుబాటులోకి వచ్చిన ‘ఫుజియాన్‌’ విమాన వాహక నౌక కూడా ఉంది. 

ఇదిలా ఉండగా, అమెరికా తన సబ్‌ మెరైన్‌ నిర్మాణ లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడి ఉంది. ఏడాదికి రెండు వర్జీనియా క్లాస్‌ అటాక్‌ బోట్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ యూఎస్‌ ఆ లక్ష్యాన్ని సాధించలేదు. కొత్తగా నిర్మిస్తున్న ‘యూఎస్‌ఎస్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా’ బాలిస్టిక్‌ మిస్సైల్‌ సబ్‌ మెరైన్‌ కూడా నిర్ధిష్ట సమయానికల్లా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. 

సబ్‌మెరైన్ల తయారీలో అమెరికా నేవీ అధికారులు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పాత ‘లాస్‌ ఏంజిల్స్‌ క్లాస్‌’ జలాంతర్గాములు రిటైర్‌ అవుతుండటంతో 2030 నాటికి అమెరికా అటాక్‌ సబ్‌మెరైన్ల సంఖ్య 47కు పడిపోయే ప్రమాదం ఉందని నివేదిక చెబుతోంది.