సామర్థ్యం ఎంత ఉన్నప్పటికీ ఏ ఒక్క నౌకాదళం కూడా ఒంటరిగా ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోలేదని, ఎప్పటికీ నౌకాదళాల మధ్య పరస్పర సహకారం తప్పనిసరి అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నావిగేషన్ స్వేచ్ఛ ఆధారంగా సమానమైన సముద్ర అవకాశాలు ఉండాలన్నది భారత్ అభిప్రాయమని మంత్రి పేర్కొన్నారు.
విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో ‘మిలన్-2026’ను ప్రారంభించిన ఆయన పలు దేశాల నౌకాదళాధికారులు, ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. భాగస్వామ్య దేశాలతో నౌకాదళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంచుకోవడం ఎంతో అవసరం అని తెలిపారు. దానితోపాటు ఇరు దేశాలు స్నేహపూర్వక వాతావరణాన్నిపెంపొందించుకోవడానికి మిలన్-2026 ప్రయత్నిస్తుందని చెప్పారు.
వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ప్రకృతి విపత్తులు ఎంతో తీవ్రతను సంతరించుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. దీని ఫలితంగా తరచూ మానవతా దృక్పథంతో సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తోందని తెలిపారు. భారతదేశం విశ్వసనీయ ప్రపంచ స్నేహితుడిగా, నిజమైన విశ్వమిత్రగా సముద్ర జలాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద, అత్యంత సమగ్రమైన కార్యక్రమం 74 దేశాల భాగస్వామ్యంతో ఈ సంవత్సరం సాగిన మిలన్ అని ఆయన చెప్పారు. ఇది భారత్‌పై నమ్మకం, బాధ్యతాయుతమైన సముద్ర భాగస్వామిగా ప్రపంచ సముద్ర సమాజం ఉంచిన విశ్వాసానికి ప్రతిబింబం అని మంత్రి కొనియాడారు. వృత్తిపరమైన నైపుణ్యాన్ని ఒక చోట చేర్చి, పరస్పర విశ్వాసాన్ని కలిగించడానికి మిలన్ వంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్, మిత్ర దేశాల నౌకలు కలిసి ప్రయాణిస్తే, సైనికులంతా కలిపి శిక్షణ పొందితే, అధికారులు కలిసి చర్చిస్తే భౌగోళిక, రాజకీయ పరిమితులు దాటి ఒక అవగాహన ఏర్పడుతుందని ఆయన వివరింతారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ జలాల వివాదాలను పరిష్కరించడానికి ఒక బలమైన సముద్రాల చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు.
అక్రమ రవాణా, అక్రమ చేపల వేట, సముద్ర ఉగ్రవాదం, సైబర్ నేరాల ముప్పును కలిసికట్టుగా ఎదుర్కోవాలని కేంద్ర మంత్రి పిలుపిచ్చారు. భారత్ రక్షణ రంగంలో అభివృద్ధి చేసిన సాంకేతిక సామర్థ్యాలను భాగస్వామ్య దేశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రపంచ నౌకాదళ నిపుణులు ఒకే లక్ష్యంతో రావడం సముద్ర భద్రతకు బలాన్నిస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి మాట్లాడుతూ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మిలన్ వేడుకల్లో భాగంగా 9 ఆసియా సభ్య దేశాల నౌకాదళాధిపతులు, ప్రతినిధులతో రక్షణ శాఖ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హిందూ, పసిఫిక్ సముద్రాల్లో వ్యూహాత్మక రక్షణ అంశాల గురించి ఇందులో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

More Stories
ఏడాదిలో హామీల అమలులో రేఖ గుప్తా ప్రభుత్వం ముందడుగు
ఆఫ్ఘన్ లో గృహ హింసను చట్టబద్దం చేసే కొత్త క్రిమినల్ కోడ్
భారత్ పట్ల తారిక్ రెహమాన్ పాలన వ్యవహారం!