పాక్ కు రావి నది నుంచి నీళ్లు బంద్

పాక్ కు రావి నది నుంచి నీళ్లు బంద్
సింధు నదీ జలాల ఒప్పందంతో తీవ్ర నీటి సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు ఇప్పుడు రావి నది నుంచి నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపేయనుంది. ఈ అంశాన్ని జమ్మూ కాశ్మీర్ మంత్రి జావేద్ అహ్మద్ రానా వెల్లడించారు. పాకిస్తాన్‌తో భారత్ కు సింధు నదీ జలాల ఒప్పందం ఉండేది. దీని ప్రకారం భారత సరిహద్దు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లోని నీటిలో పాకిస్తాన్‌కు వాటా ఉంది. మన దగ్గర మిగులు జలాల్ని పాకిస్తాన్‌కు విడుదల చేయాల్సి వచ్చేది.

అలాగే మన దేశంలో ఆయా నదులపై ప్రాజెక్టులు కట్టడానికి వీల్లేదు. కానీ, గత ఏడాది పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఈ ఒప్పందాన్ని భారత్  రద్దు చేసుకుంది. అంటే భారత్ నుంచి పాకిస్తాన్‌కు ప్రవహించే నదీ నీటిని ఇండియా ఆపేయొచ్చు. అలాగే ఇక్కడ నిర్మాణాలకు పాక్ అనుమతి అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని భారత్ భావిస్తోంది. 

ఇప్పటికే హైడ్రో పవర్ ప్రాజెక్టు, ఇతర బ్యారేజీల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో ఇప్పుడు రావి నదిపై షాపూర్ కండి బ్యారేజ్‌ను నిర్మిస్తోంది. దీని నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. మార్చి 31 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా రావి నదిపై నీటిని మనం నిల్వచేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్‌కు ఈ నది నుంచి నీటి విడుదల ఉండదు. 

గతంలో ఇక్కడ బ్యారేజీ లేకపోవడం వల్ల నీటిని వృథాగా పాకిస్తాన్‌కు వదలాల్సి వచ్చేది. కానీ, ఇకపై పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసుకుని ఇండియానే వాడుకుంటుంది. నిల్వ సామర్ధ్యానికి మించి నీళ్లొస్తే అప్పుడు పాకిస్తాన్‌కు వదిలే అవకాశం ఉండొచ్చు. ఈ నిర్ణయం ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి మేలు జరుగుతుంది. వేసవిలో నీటి ఇబ్బందులు తీరుతాయి. 

ముఖ్యంగా ఎక్కువ కరువు ఎదుర్కొంటున్న కథ్వా, సాంబా జిల్లాలకు మేలు జరుగుతుంది. `ఇక ఈ నిర్ణయం ద్వారా పాకిస్తాన్ ఇబ్బంది పడుతుంది కదా’ అన్న ప్రశ్నకు జమ్మూ కాశ్మీర్ మంత్రి జావేద్ సమాధానమిచ్చారు. ‘వాళ్లు ఇబ్బంది పడితే మనకెందుకు సమస్య అని, ఇది వాళ్లు సృష్టించుకున్న పరిస్థితే కదా’ అని ఆయన వ్యాఖ్యానించారు.