సుమారు రెండు దశాబ్దాల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో ప్రధాన నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి గతంలో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ వెంటనే ఆయన నాలుగు వారాల్లోగా సంబంధిత అధికారుల ముందు లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
నటి ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యూష సినీ రంగంలో స్థిరపడగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ విషం తాగిన స్థితిలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థరెడ్డి కోలుకుని మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు.
కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగడం వల్లే ప్రత్యూష మరణించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అప్పట్లో ఆమెపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం నియమించిన వైద్య బృందం వాటిని తోసిపుచ్చింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ సిద్ధార్థరెడ్డిపై ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది.
దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో ఆయనకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అనంతరం సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, 2011లో కోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను పెంచింది. ఈ తీర్పుపై ఇటు సిద్ధార్థరెడ్డి, అటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు, చివరకు హైకోర్టు విధించిన శిక్షనే ఖరారు చేస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించింది.

More Stories
బిజెపి కార్యకర్తలకు శిక్షణా శిబిరం
తెలంగాణాలో 15 మునిసిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ
విద్యుత్ బకాయిలు రూ 15 కోట్లు చెల్లించాలి.. ‘గీతం’ కు సుప్రీం ఆదేశం