దేశవ్యాప్తంగా పటిష్ఠమైన ‘సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్’

దేశవ్యాప్తంగా పటిష్ఠమైన ‘సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్’

డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా పటిష్ఠమైన ‘సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్’ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.  ఢిల్లీ పోలీసుల 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటూ రాబోయే కొద్ది నెలల్లోనే కొత్త ‘జాతీయ భద్ర తా నిర్మాణాన్ని’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  దీని ప్రధాన లక్ష్యం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే అని చెప్పారు.

ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఒక భారీ సీసీటీవీ నెట్‌వర్క్‌ను సృష్టిస్తామని, వీటిని పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్’ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఈ నిఘా వ్యవస్థకు చట్టపరమైన రక్షణ కూడా కల్పిస్తామని, దీనివల్ల డ్రగ్స్ నేరాలను రియల్ టైమ్‌లో పసిగట్టడం సులభమవుతుందని ఆయన చెప్పారు. కేవలం అంతర్గత భద్రతే కాదు, సరిహద్దుల రక్షణపైనా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని షా తెలిపారు. 

“దేశంలోని ప్రతి భూ సరిహద్దులో భద్రతా ఏర్పాట్లను ఆధునీకరిస్తాం. నిఘా వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తాం. ఫెన్సింగ్ (కంచె), ఇతర మౌలిక సదుపాయాలను బలపరుస్తాం. చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రతా దళాల మధ్య సమన్వయం పెంచుతాం. అక్రమ ప్రవేశాలకు ఇక ఆస్కారం ఉండదు” అని స్పష్టం చేశారు.

మావోయిస్టుల ఏరివేతపై దాదాపు పూర్తికావవచ్చిమదని చెబుతూ  “నక్సలిజం ఒకప్పుడు దేశంలోని 11 రాష్ట్రాలకు విస్తరించి పెద్ద సవాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమస్య దాదాపుగా కొలిక్కి వచ్చింది. ప్రభావిత ప్రాంతాలను మావోయిస్టుల చెర నుంచి విడిపించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. మార్చి 31, 2026 నాటికి దేశం నుంచి మావోయిస్టు హింసను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఇది మన భద్రతా దళాలకు దక్కే అతిపెద్ద విజయం.” అని పేర్కొన్నారు.

గత 12 ఏళ్ల కాలాన్ని (2014 నుంచి 2026 వరకు) భారత అంతర్గత భద్రత చరిత్రలో ‘స్వర్ణయుగం’గా అమిత్ షా అభివర్ణించారు. “2014కు ముందు దేశాన్ని కశ్మీర్ సమస్య, ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి, మావోయిస్టు హింస అనే మూడు ప్రధాన సమస్యలు వేధించేవి. ఈ మూడు సమస్యలు 3-4 దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడించాయి” అని గుర్తు చేశారు. 

కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు మారాయని, కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస 80 శాతం తగ్గిందని, ఈ మూడు ప్రాంతాలు పూర్తిగా హింస రహితంగా మారే రోజు ఎంతో దూరంలో లేదని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చిన మార్పులను కేంద్ర హోంమంత్రి ప్రస్తావిస్తూ అక్కడ 10,000 మందికి పైగా యువకులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారని, 20కి పైగా శాంతి ఒప్పందాల ద్వారా ఆ ప్రాంతంలో ప్రశాంతత నెలకొల్పగలిగామని తెలిపారు.

దేశ రాజధాని రక్షణలో ఢిల్లీ పోలీసులు చూపుతున్న తెగువను మంత్రి అమిత్ షా కొనియాడారు. “పార్లమెంట్ దాడి కేసు అయినా, ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు అయినా, దిల్లీ పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు. క్లిష్టమైన కేసులను ఛేదించడంలో వారి నైపుణ్యం అద్భుతం. దేశ రక్షణలో వారు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. 2029 నాటికి దేశం ఎదుర్కొంటున్న అన్ని భద్రతా సవాళ్లను సమన్వయంతో, నిరంతర కృషితో అధిగమిస్తాం” అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.