* హ్యాట్రిక్ తో సూపర్ 8 దశకు దూసుకు పోయిన భారత్
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. పొట్టి కప్పు టోర్నీలో పాకిస్థాన్‌పై భారత్ మరోసారి విజయ దుందుభి మోగించింది. తాజా ఎడిషన్‌లో ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను 61 భారీ పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన టీమ్ఇండియా, దాయాది జట్టుపై తమ ట్రాక్ రికార్డ్‌ను మెరుగుపరుచుకుంది. తాజా విజయంతో ఈ వరల్డ్‌కప్‌లో భారత్ సూపర్ 8 దశకు దూసుకుపోయింది.
గ్రూప్-ఏలో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించింది. ఇషాన్ కిషన్ (77, 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీతో చెలరేగటంతో తొలుత భారత్ 175/7 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (32, 29 బంతుల్లో 3 ఫోర్లు), శివం దూబె (27, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (25, 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
ఛేదనలో పాకిస్తాన్ 18 ఓవర్లలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు సమిష్టిగా విజృంభించారు. హార్దిక్, బుమ్రా, వరుణ్, అక్షర్ రెండేసి వికెట్లు పడగొట్టగా పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున ఉస్మాన్ ఖాన్ (44, 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), షహీన్ షా అఫ్రిది (23 నాటౌట్, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.
ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. పరుగుల పరంగా భారత్‌కు పాకిస్తాన్‌పై ఇదే భారీ విజయం. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయాలు 8-1గా నిలిచింది. ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత్ 6 పాయింట్లతో పట్టికలో ఆగ్రస్థానంలో ఉంది. గ్రూప్ దశలో ఆఖరు మ్యాచ్‌లో బుధవారం నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది.
ఆదివారం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌లో అభిషేక్ శర్మ (0) పాక్ కెప్టెన్ సల్మాన్ ఉచ్చులో పడ్డాడు.కానీ, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (77) దుమ్మురేపాడు. షహీన్ షా అఫ్రిదికి సిక్సర్‌తో స్వాగతం పలికిన ఇషాన్ కిషన్.. పవర్‌ప్లేలో రెచ్చిపోయాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ (25)తో కలిసి రెండో వికెట్‌కు 46 బంతుల్లో 87 పరుగులు జోడించాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో పాక్ బౌలర్లను ఒత్తిడిలో పడేసిన ఇషాన్ సెంచరీ దిశగా సాగాడు.
ఆయుబ్ ఓవర్లో కిషన్ వికెట్ కోల్పోయాడు. కిషన్ అవుటయ్యే సరికి భారత్ స్కోరు 88/2 కాగా, అందులో కిషన్ ఒక్కడే 77 పరుగులు చేశాడు. తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్‌లు 38 పరుగుల భాగస్వామ్యంతో మెరిసి భారీ స్కోరుకు పునాది వేశారు. కానీ స్పిన్నర్ ఆయుబ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుస బంతుల్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (0)లను సాగనంపి గట్టి దెబ్బకొట్టాడు.
సూర్య తనదైన దూకుడు చూపించకపోయినా, తొలుత తిలక్‌తో, ఆ తర్వాత దూబెతో కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. శివం దూబె (27), రింకు సింగ్ (11 నాటౌట్) ఆఖరు ఓవర్లో 16 పరుగులు పిండుకుని భారత్‌కు 175 పరుగుల స్కోరు అందించారు. పాక్ బౌలర్లలో ఆయుబ్ (3/25) మూడు వికెట్లతో మాయ చేయగా.. సల్మాన్ (1/10), ఉస్మాన్ (1/24), షహీన్ షా అఫ్రిది (1/31) తలా ఓ వికెట్ పడగొట్టారు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్. 2014 ప్రపంచకప్‌లో మీర్పూర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులకే కుప్పకూలింది. ఇదే పొట్టి కప్పులో పాక్‌కు అత్యల్ప స్కోరు. 2024 ఎడిషన్‌లో భారత్‌తో మ్యాచ్‌లో పాక్ 113-7 స్కోర్‌కే పరిమితమైంది. ఇది రెండో అత్యల్ప స్కోరు. అలాగే పరుగుల పరంగా పాకిస్థాన్‌కు ఇది రెండో ఘోరమైన ఓటమి. 2014లో విండీస్‌పై 84 రన్స్ తేడాతో ఓడింది.

More Stories
తారిఖ్ బంగ్లా ప్రధాని కావడంతో ఇరకాటంలో హసీనా భవితవ్యం
‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ ‘అన్సార్ ఇంటీరియం’
`బలమైన స్థానం’ నుంచే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం