కాలుష్య కారకులు ఎక్కువ భారం మోయాలి

కాలుష్య కారకులు ఎక్కువ భారం మోయాలి
కాలుష్యానికి ఎవరు కారకులో వారే మెజారిటీ భారాన్ని మోయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. వాతావరణ మార్పులపై అంతర్జాతీయంగా చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించి దేశాల మధ్య విభిన్నమైన రీతిలో బాధ్యతల విభజన వుండాలని ఆమె సూచించారు. కాలుష్యం ఎవరైతే సృష్టిస్తారో వారే చెల్లించాలనే సూత్రాన్ని ఇక్కడ అనుసరించాలని ఆమె తేల్చి చెప్పారు. 
 
మ్యునిచ్‌లో శనివారం జరిగిన ‘వాతావరణ భద్రత’ సమావేశంలో ఆమె ప్రసంగించారు. తీవ్ర స్థాయిలో కాలుష్య కారకాలకు కారణమయ్యే దేశాలు ఈ వాతావరణ మార్పుల వల్ల కలిగే ఆందోళనలను పరిష్కరించడానికి ముందుకు రావాలని, ఆ భారంలో మెజారిటీ వాటాను భరించాలని నిర్మల సీతారామన్ కోరారు. కాలుష్య సంక్షోభానికి పెద్దగా కారణమవని దేశాలు కూడా సమానంగానే మూల్యం చెల్లించాలని కోరడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. 
 
సాంకేతిక సహకారం కూడా వుండాలని చెబుతూ వాతావరణ సంబంధిత సాంకేతికతలను వాణిజ్య ప్రాతిపదికన పంచుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలను ఆమె కోరారు. ఇటీవలి సంవత్సరాల్లో భారత్‌ వాతావరణ సంబంధిత కార్యకలాపాలపై ఖర్చు ఎక్కువగా పెడుతోందని ఆర్ధిక మంత్రి చెప్పారు. బయట నుండి వచ్చే నిధుల కోసమో లేదా సాంకేతికత కోసమే వేచిచూడడం లేదని ఆమె తెలిపారు. 
 
ఒకవేళ అలాంటి సహకారం వుంటే స్వాగతిస్తామని చెబుతూ  వాతావరణ మార్పుల వల్ల తలెత్తే ఆందోళనలను పరిష్కరించని పక్షంలో పెద్దసంఖ్యలో ప్రజలను, ప్రాంతాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన ఆమె వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సత్వరమే కమ్యూనిటీలను, జీవనోపాధులను కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఆమె చెప్పారు. ఈ ఏడాది తమ బడ్జెట్‌లో పర్యావరణ కేటాయింపులు పెంచామని ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు.