మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం
 
* మహాయుతికి మద్దతు ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ కుర్తాజ్ఞతలు
 
సోమవారం జరిగిన మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి గణనీయమైన విజయం సాధించి. 731 స్థానాలకు 552 స్థానాలను గెలుచుకుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అధికార మహాయుతిలో, బిజెపి 225 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 165, శివసేనకు 162 స్థానాలు లభించాయి.
 
ప్రతిపక్ష మహా వికాస్ అఘాడిలో, కాంగ్రెస్ 55 స్థానాలతో అగ్రస్థానంలో నిలిచింది. తరువాత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి)కి 43,  శరద్ పవార్ ఎన్సీపీ(ఎస్పీ)కి 26 స్థానాలు లభించాయి. లాతూర్, రత్నగిరిలలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకుంది. స్వతంత్రులు 20 సీట్లు గెలుచుకున్నారు. ఎన్నికల కమిషన్ వద్ద నమోదైన పార్టీలు 14, నమోదు కానీ పార్టీలు 7 స్థానాలను గెలుచుకున్నాయి.
 
పూణే జెడ్పిలో ఎన్సీపీ 73 స్థానాల్లో 51 స్థానాలను గెలుచుకుంది. జనవరి 28న విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన కొద్ది రోజులకే ఎన్నికలు జరుగుతున్నాయి. రాయ్‌గఢ్ జెడ్‌పిలో శివసేన 59 సీట్లలో 23 సీట్లను గెలుచుకుంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ రత్నగిరి జెడ్‌పిలో 56 సీట్లలో 41 సీట్లను గెలుచుకుంది. సింధుదుర్గ్‌లో బిజెపి 50 సీట్లలో 27 సీట్లను గెలుచుకుంది.
 
సతారా, సోలాపూర్, ఛత్రపతి సంభాజీనగర్, పర్భాని, ధరశివ్, లాతూర్‌లలో కూడా బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొల్హాపూర్‌లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 12 జిల్లా పరిషత్‌లు, 125 పంచాయతీ సమితిలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పంచాయతీ సమితి ఫలితాలను ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు.
 
ఈలోగా, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు, దీనిని “సుపరిపాలన” కు ఓటుగా అభివర్ణించారు. “మరోసారి, మహారాష్ట్ర బిజెపి, మహాయుతిని ఆశీర్వదిస్తుంది! మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బిజెపి, మహాయుతి అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు మాకు బలమైన ఆదేశాన్ని ఇచ్చారు” అని ప్రధాని మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
 గ్రామీణ, పట్టణ మహారాష్ట్ర అంతటా, రాష్ట్ర ప్రజలు సుపరిపాలన, రాష్ట్ర అద్భుతమైన సంస్కృతి స్ఫూర్తితో పనిచేసే కూటమిని కోరుకుంటున్నారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. “మహారాష్ట్రలోని నా సోదరీమణులు, సోదరులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. మహాయుతిలోని ప్రతి కార్యకర్తను క్షేత్రస్థాయిలో “అలసిపోకుండా” పనిచేసినందుకు, మహారాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ట్రాక్ రికార్డ్‌ను, సుపరిపాలన కోసం ఎన్డీయే దార్శనికతను వివరించినందుకు ప్రధాని మోదీ ప్రశంసించారు.
 
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పట్టణ, పాక్షిక పట్టణ, గ్రామీణ మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. మహారాష్ట్రలో జరిగిన జిల్లా పరిషత్,  పంచాయతీ సమితి ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు మరోసారి మహాకూటమిపై తమ విశ్వాసాన్ని చాటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నంబర్ వన్ పార్టీగా అవతరించిందని, దాని మిత్రపక్షాల పనితీరు కూడా చాలా బలంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
బీజేపీ కేవలం పట్టణ పార్టీ అనే భావన 2014లోనే తొలగిపోయిందని ముఖ్యమంత్రి చెప్పారు. 2017లో పార్టీ మరింత మెరుగైన పనితీరు కనబరిచిందని, ఈసారి ఫలితాలు ఆ బలాన్ని మరింత సుస్థిరం చేశాయని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ, ప్రతిపక్షాలు ప్రజల నాడిని అర్థం చేసుకోవాలని హితవు చెప్పారు.  “ప్రతిపక్షాలు ప్రజలతో సంబంధాలు కోల్పోయి, కేవలం ఆరోపణల రాజకీయాలు చేస్తున్నాయి, అందుకే ఇలాంటి ఎన్నికల ఫలితాలు పదేపదే వస్తున్నాయి,” అని ఆయన ఎద్దేవా చేశారు.