వామపక్షాల సిద్ధాంతం విధ్వంసానికి సూచిక

వామపక్షాల సిద్ధాంతం విధ్వంసానికి సూచిక
వామపక్షాల సిద్ధాంతం విధ్వంసానికి సూచిక అని, దాని నుంచి దేశం త్వరగా బయటపడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ అభివృద్ధి ఉండదని తెలిపారు.  ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పుర్‌లో ఆర్గనైజర్ వారపత్రిక నిర్వహించిన “ఛత్తీస్‌గఢ్ @ 25: దృక్కోణాన్ని మార్చడం” సదస్సు ముగింపు కార్యక్రమంలో  పాల్గొంటూ  నక్సల్స్ సమస్యను అభివృద్ధితో ముడిపెట్టలేమని తెలిపారు. 
 
వామపక్ష భావజాలమే నక్సల్స్ సమస్యకు మూలమని ఆరోపించారు. వామపక్ష సిద్ధాంతం వెనక ఉన్న వాస్తవాన్ని భారత పౌరులు అర్థం చేసుకోవాలని సూచించారు. త్రిపుర, బంగాల్‌లో వామపక్షం ఉనికి కోల్పోయిందని కేరళలో కొంతవరకు మనుగడ సాగిస్తోందని తెలిపారు. తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో అక్కడ కూడా మార్పు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 

రాజకీయాలు, పాలనలో భావజాలం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. గత 75 ఏళ్లలో మూడు విభిన్న సిద్ధాంతాలకు చెందిన పార్టీలు భారత్‌ను పరిపాలించాయని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలే మంచి పాలన అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయని చెప్పారు.  అభివృద్ధి లేకపోవడం, శాంతిభద్రతల సమస్య వల్ల నక్సల్‌ సమస్య తలెత్తలేదని, భావజాలమే దానికి మూలమని అమిత్ షా స్పష్టం చేశారు. 

కమ్యూనిస్ట్ ప్రభుత్వాల్లో ఎలాంటి అభివృద్ధి ఉండదని విమర్శించారు. సంక్షేమం పేరుతో గిరిజనులకు ఆయుధాలు ఇచ్చి వారిని బలి చేస్తున్నారని ఆరోపించారు. “దేశంలో మూడు విభిన్న సిద్ధాంతాలు కలిగిన ప్రభుత్వాలు సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్నాయి. అప్పట్లో కాంగ్రెస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. అటుు కమ్యూనిస్టులు కూడా పాలించారు” అని గుర్తు చేశారు.
 
సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, ఈ మూడు పార్టీల కింద పనిచేసిన ప్రభుత్వాల గణాంకాలను విశ్లేషించి డేటాను ఈ దేశ ప్రజల ముందు ఉంచాలని చెప్పారు. “నేను ఇప్పటికే దీనిపై అధ్యయనం చేశాను. ఈ మూడు సిద్ధాంతాల్లో భారతీయ జనతా పార్టీనే అత్యుత్తమంగా పనిచేసిందని నేను చెప్పగను. దీనిని ఎవరూ కాదనలేరు. ఛత్తీస్‌గఢ్ దీనికి ఒక ఉదాహరణ” అని అమిత్ షా తెలిపారు.

అంతకుముందు  నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌పై అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తూ రానున్న మార్చి 31కల్లా భారత్‌ నక్సల్స్‌ రహిత దేశంగా మారబోతోందని ప్రకటించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీల వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్లు చెప్పారు. 

ఈ సమావేశంలో ఛత్తీ్‌సగఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్‌ శర్మ, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌, హోం వ్యవహారాల శాఖ స్పెషల్‌ సెక్రటరీ, సీఆర్‌పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

కాగా, గత కొన్నేళ్లుగా మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు తీవ్రతరం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతేడాది జనవరి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో ఆయా ఎన్‌కౌంటర్‌లలో నంబాల కేశవరావు వంటి అగ్ర నేతలు సహా 500 మందికిపైగా మావోయిస్టులు మరణించారు. ఇక అదే వ్యవధిలో రాష్ట్రంలో దాదాపు 1,900 మంది నక్సలైట్లు అరెస్టు కాగా, మరో 2,500 మందికి పైగా లొంగిపోయారు.