తాజా అమెరికా మ్యాప్ లో భారత్ లో పిఓకె, ఆక్సాయ్ చిన్‌

తాజా అమెరికా మ్యాప్ లో భారత్ లో పిఓకె, ఆక్సాయ్ చిన్‌
 
మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదాను అమెరికా, భారత్ లు ప్రకటించిన సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టేడ్ర్ డీల్‌పై ట్రంప్ యంత్రాంగం రూపొందించిన భారత్ మ్యాప్‌ చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా మొత్తం జమ్మూ కశ్మీర్‌ను భారత్‌‌ భూభాగంగా పేర్కొంటూ అమెరికా కొత్త మ్యాప్‌ విడుదల చేసింది. అంతేకాదు, చైనా తన భూభాగంగా వాదించే  ఆక్సాయ్ చిన్‌  ను కూడా ఇందులో చేర్చింది.
భారత ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ధ్రువీకరించడానికి అమెరికా ఆమోదం అవసరం లేదు. కశ్మీర్ మొత్తం ఎప్పటికీ తమదేనని తురచూ భారత్ స్పష్టం చేస్తూనే ఉంది. అయినప్పటికీ, ఇది అమెరికా గత వైఖరికి భిన్నంగా ఉండటం గమనార్హం.  అమెరికా నాయకత్వం భారత మ్యాప్‌నకు అనుగుణంగా ఉందని ఉద్దేశపూర్వకంగా లేదా యాదృచ్ఛికంగా పాక్‌కు బలమైన దౌత్య సంకేతాన్ని పంపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ ఉత్తర కేంద్రపాలిత ప్రాంతం పూర్తిగా చేర్చిన భారతదేశ రాజకీయ సరిహద్దుల దృశ్య చిత్రణ, ప్రాదేశిక సమస్యపై వాషింగ్టన్ వైఖరికి స్పష్టమైన సంకేతంగా పరిగణించబడుతోంది. కార్టోగ్రాఫిక్ వివరాలు భారతదేశ అధికారిక పటంతో సారూప్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇది భారతదేశం-అమెరికా వ్యూహాత్మక సంబంధాల లోతును వెల్లడి చేస్తుంది. 
 
పాకిస్తాన్ అమెరికాతో దౌత్యపరమైన సంబంధాలను తీవ్రతరం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పరిణామం జరిగింది. ఇది ఇస్లామాబాద్‌కు ఎదురుదెబ్బగా కనిపిస్తుంది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధికార కారిడార్లలో గట్టిగా లాబీయింగ్ చేయడానికి వాషింగ్టన్‌కు అనేకసార్లు వెళ్లారు.
గతంలో, అమెరికా విడుదల చేసిన మ్యాప్‌లు పీఓకేపై పాకిస్థాన్ వాదనలకు అనుగుణంగా ఉండేవి. కానీ, ట్రంప్ యంత్రాంగం విడుదల చేసిన తాజా మ్యాప్ పాక్ వాదనలను తప్పుబడుతోంది.  రెండు రోజుల కిందట పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ పై కారుకూతలు కూసిన నేపథ్యంలో అమెరికా మ్యాప్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ ప్రతీకార సుంకాలతో దాదాపు ఏడాదిగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలకు భారత్, అమెరికా తెరదించుతూ వాణిజ్య ఒప్పందంపై అంగీకారానికి వచ్చాయి.
దీంతో భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను 18 శాతానికి ట్రంప్ తగ్గించారు. ఆసియా దేశాలలో ఇదే అత్యల్పం కావడం చెప్పుకోదగ్గ అంశం.  సరిహద్దు సంఘర్షణల్లో ఉన్న భారత్, పాకిస్థాన్ విషయంలో జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రారంభించిన, తర్వాతి అమెరికా అధ్యక్షులు అనుసరించిన విదేశాంగ విధానానికి భిన్నమైన విధానాన్ని ట్రంప్ అవలంభిస్తున్నారు. 
 
అమెరికా రూపొందించిన తాజా మ్యాప్‌లో లడఖ్‌లోని ఆక్సాయ్ చిన్‌‌ను కూడా భారత్‌ భూభాగంగా పేర్కొంది. ఈ ప్రాంతం తమదేనంటూ చైనా తరుచూ వాదిస్తుండగా, భారత్ ఆ వాదనలను కొట్టిపారేస్తుంది.  అమెరికా సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు ఉపయోగించే మ్యాప్‌లలో భారత సరిహద్దులు ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ , అరుణాచల్ ప్రదేశ్‌లను తప్పుగా చూపుడాన్ని న్యూఢిల్లీ నిరంతరం అభ్యంతర తెలుపుతూనే ఉంది. 
 
అమెరికా తాజా చర్య భారత్ దీర్ఘకాల ఆందోళనను చివరకు పరిగణనలోకి తీసుకున్నట్టయ్యింది. ఈ పరిణామాలపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.  అంతేకాదు, ఇది పాకిస్థాన్‌‌కు ,ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌, వాషింగ్టన్ పర్యటనల ప్రచారానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొంటున్నారు. 
 
గత ఆరు నెలలుగా అమెరికాతో పాకిస్థాన్ దౌత్యం పతాకస్థాయికి చేరింది. ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మూడుసార్లు అమెరికాకు వెళ్లొచ్చి, రెండుసార్లు ట్రంప్‌తో సమావేశమయ్యారు. గతేడాది జూన్‌లో తొలిసారి వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను పాక్ ఆర్మీ చీఫ్ కలుసుకున్నారు. దేశ నాయకత్వం లేకుండా పాక్ ఆర్మీ చీఫ్‌తో అమెరికా అధ్యక్షుడు నేరుగా భేటీ కావడం అదే మొదటిసారి.
2020లో, పాకిస్తాన్ ఒక కొత్త రాజకీయ పటాన్ని ఆమోదించింది. అందులో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు గుజరాత్‌లోని జునాగఢ్, మానవదార్, సర్ క్రీక్‌లను తన భూభాగంగా పేర్కొంది. భారతదేశం ఈ చర్యను తిరస్కరించింది. దీనిని “రాజకీయ అసంబద్ధతతో కూడిన చర్య” అని అభివర్ణించింది. భారత భూభాగంపై చేసిన నిరాధారమైన వాదనలను తోసిపుచ్చింది.